ప్రతిపక్షాలు పారిపోవాలి, ఏపీలో రైతులు చనిపోవడం లేదా: కెసిఆర్, టార్గెట్ బాబు
హైదరాబాద్: ప్రతిపక్షాలు పారిపోయేంత వరకు సభ నిర్వహిద్దామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్షం సమావేశమైంది.
ఈ సందర్భంగా కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి టిఆర్ఎస్ నుంచి వంద శాతం మంది హాజరు కావాలని సూచించారు. ప్రతి సభ్యుడు అంశాల వారీగా పూర్తి వివరాలతో సభకు రావాలని చెప్పారు. అన్ని అంశాల పైన చర్చించే వరకు సభను నిర్వహిద్దామని చెప్పారు.

ఏపీలో ఆత్మహత్యలు లేవా?
తెలంగాణలో ఆత్మహత్యల పైన విపక్షాలు ధ్వజమెత్తుతోన్న విషయం తెలిసిందే. దీని పైనా కెసిఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవా అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో ఆశా వర్కర్ల ఆందోళనలు కమ్యూనిస్టులకు పట్టవా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్మహత్యల పైన కమ్యూనిస్టు నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. సాగర్ నుంచి రెండో పంటకు నీరు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని కెసిఆర్ చెప్పారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు లేవా అన్నారు.
కాగా, తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పోలీసులు భద్రత పెంచారు.












Click it and Unblock the Notifications