తడిబట్టతో గొంతు కోసే మూర్ఖుడు కేసీఆర్.!ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా సీఎం కుట్రలన్న బండి సంజయ్.!
హైదరాబాద్ : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మహా కుట్రకు ప్లాన్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తనపైన, బీజేపీపైన నెపం నెట్టి సుప్రీంకోర్టుకు వెళ్లి ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాకుండా స్టే తెచ్చుకునేందుకు స్కెచ్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అందులో భాగంగా తాను ఎస్టీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉప్పల్ నియోజకవర్గంలోని విఘ్నేశ్వర ఆలయం ముందు ప్రమాణం చేద్దాం... రా. ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నదెవరో తేల్చుకుందాం అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.

లిక్కర్ సహా అన్ని స్కాముల్లోనూ కేసీఆర్ కుటుంబమే..
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. బాణా సంచా పేల్చి, పూలు జల్లి, మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. హెచ్ బి కాలనీ ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తా వద్ద భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉధ్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తూ సీఎం చంద్రశేఖర్ రావుపై నిప్పులు చెరిగారు.
సోమవారమే ఉప్పల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగు పెట్టింది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి అద్వానంగా ఉంది. చిన్న వర్షం వస్తే చాలు.. మోకాళ్ళ లోతు నీళ్లు, బురద. ఇక్కడికి వచ్చి ఉప్పల్ ని దత్తత తీసుకుంటానన్న నాయకులు ఎక్కడికి పోయారని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి..
మహిళలను గౌరవించడమే మన భారతీయ సంస్కృతి అని, మహిళలను గౌరవించని నీచ సంస్కృతి టీఆర్ఎస్ వాళ్ళదని బండి సంజయ్ మండి పడ్డారు. లిక్కర్ స్కామ్, డ్రగ్స్, పత్తాలు, కబ్జాలు.. ఇలా అన్నీ చంద్రశేఖర్ రావు బిడ్డవేనని ఎద్దేవా చేసారు. సీబీఐ అంటే కాలు ఇరుగుతది... ఈడీ అంటే కరోనా వస్తది, ప్రజా సమస్యలను పట్టించుకోని ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని ఘాటు విమర్శలు చేసారు. తడి బట్టతో గొంతు కోసే మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ వాళ్ళను తీసుకెళ్లి డంపింగ్ యార్డులో కట్టేయాలని నిన్న మేడ్చల్ లో చెప్పానని బండి సంజయ్ గుర్తు చేసారు.

ఏ ఒక్క హామీ అమలు కాలేదు..
ఈ ఉప్పల్ నియోజకవర్గంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు? ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చాడు. దేశంలో, రాష్ట్రాల పర్యటన చేస్తూ దోచుకున్న సొమ్మును అక్కడ ఇచ్చి వస్తున్నాడని సీఎం చంద్రశేఖర్ రావుపై మండి పడ్డారు. స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి ఎందుకు చేయడం లేదో టిఆర్ఎస్ నేతలను గల్లా పట్టి ప్రశ్నించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉచితంగా నీళ్లు ఇస్తానన్న సీఎం, ఒక్కో ఇంటికి 500 రూపాయలు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్,టిఆర్ఎస్,టిడిపి పార్టీలకు ఓటు వేశారు..
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కాదని, చంద్రశేఖర్ రావు ఉన్నన్ని రోజులు కొత్త సచివాలయంలో ఒక కుర్చీ వేసి, దళితుడిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని బండి సంజయ్ ప్రతిపాదించారు. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా చేద్దామంటే, ఆ ఎస్టీ బిడ్డను ఓడించే ప్రయత్నం చేసినోడు చంద్రశేఖర్ రావు అని, ఎస్టీలను మోసం చేసిన సీఎంను ఎస్టీలు నమ్ముతారా?అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి పార్టీలకు ఓటు వేశారు. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. సంవత్సరం నుంచి మీ కోసమే పాదయాత్ర చేస్తున్నానన్నారు బండి సంజయ్. ఈనెల 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేటలో సాయంత్రం 4 గంటలకు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఉంటుందని, ఆ ముగింపు సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని బండి సంజయ్ విజ్ఞప్తి చేసారు.












Click it and Unblock the Notifications