కేసీఆర్‌ను ఎన్టీఆర్‌తో పోల్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు: ఎందుకంటే?
హైదరాబాద్: పేదల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. తాజాగా రాయపర్తి మండలం శివరామపురం(ఆర్ అండ్ ఆర్ కాలనీ) కి చెందిన కాంగ్రెస్ నాయకులు చెడుపాక సుమన్, ప్రభాకర్, చిన్న సోమయ్య, సంపత్, సోమిరెడ్డి, యాకయ్య తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్నదని పేర్కొన్నారు.

రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. అంతేగాక, తెలుగుదేశం పార్టీ వ్యవప్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరే పేదల కోసం పనిచేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరే మంచి ముఖ్యమంత్రులని.. మిగిలిన వారందరూ బ్రోకర్లేనని వ్యాఖ్యానించారు. ములుగు జిల్లా కోసం అహర్నిశలు పనిచేసింది సీఎం కేసీఆర్ అని అన్నారు.
60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు కేవలం పదేళ్లలోనే అవుతాయా? అని ప్రశ్నించారు. అన్నింటికీ ఓపిక అవసరమన్నారు. గిరిజనులతోపాటు అర్హులైన గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అందుకు అడ్డంకులు సృష్టించిందన్నారు.












Click it and Unblock the Notifications