మోదీని మళ్లీ ప్రధానిగా చూడ్డానికే..: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన భారత్ రాష్ట్ర సమితి బహిరంగ సభపై విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎదురుదాడికి దిగారు. బీఆర్ఎస్ ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఈ పార్టీ ఆవిర్భవించిందనే విమర్శలూ వెల్లువెత్తుతోన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఈ తరహా విమర్శల దాడికి దిగింది.

జోష్ లో క్యాడర్..
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ సభ గ్రాండ్ సక్సెస్ అయిన జోష్ లో ఉన్నారు కేసీఆర్. ఈ సభకు మూడు జాతీయ పార్టీల నాయకులు హాజరు కావడం, పలువురు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్, జాతీయ స్థాయి నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేయడం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై పోరాటానికి వారంతా తమ మద్దతు ప్రకటించడం.. బీఆర్ఎస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపింది.

కేసీఆర్ సారథ్యంలో..
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోన్న ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాది పార్టీ, వామపక్షాల మద్దతును కూడ గట్టడంలో విజయం సాధించారు. వారిని ఒకే వేదికపైకి తీసుకుని రాగలిగారు. బీజేపీ పెద్దలకూ హెచ్చరికలను జారీ చేశారాయన. 2024 తరువాత ప్రధాని మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమంటూ గర్జించారు. తాము ఢిల్లీకి వెళ్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనీ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని అన్నారు.

బీజేపీ చేతుల్లో..
బీఆర్ఎస్ పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు, అదే స్థాయిలో ఆరోపణలు సంధించారు. బీజేపీకి హ్యాండ్ గ్లోవ్స్ గా బీఆర్ఎస్ ఆవిర్భవించిందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్.. బీజేపీతో చేతులు కలిపిందని మండిపడ్డారు. ఈ విషయం తెలియడం వల్లే మిగిలిన ప్రతిపక్షాలేవీ ఖమ్మం సభకు రాలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ను బలహీనపర్చడానికే..
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడానికే.. ప్రధాని మోదీ తెలివిగా బీఆర్ఎస్ ను రాజకీయ తెర మీదికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడమే బీఆర్ఎస్ లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా మోదీని మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించడానికి కేసీఆర్ కుట్ర పన్నారని విమర్శించారు. కేసీఆర్ కు మోదీ పరోక్షంగా మద్దతు ఇస్తోన్నారని చెప్పారు.

బీఆర్ఎస్ సహా..
కాంగ్రెస్‌ను బలహీనపరచడానికి.. బీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలను బీజేపీ వాడుకుంటోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలు ఏవీ పని చేయబోవని ఆయన తేల్చి చెప్పారు. భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలందరినీ రాహుల్ గాంధీ ఏకం చేశారని, బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు- దేశానికి సరికొత్త నాయకత్వాన్ని అందించనున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications