కేసీఆర్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో వెతకాలంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు కార్యకర్తలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా శ్రీకాంత్ రావు మాట్లాడుతూ.. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం గజ్వేల్ ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జరిగే చర్చల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోలీసులు పది రోజుల్లో ఆచూకీ తెలపకపోతే.. తామే ఆయన కోసం గాలింపు చర్యలు చేడతామని శ్రీకాంత్ రావు తెలిపారు.

కాగా, గత సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురిసన సమయంలో హైదరాబాద్ నగరంలో కేసీఆర్ కనబడటం లేదంటూ పలు పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు.
భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ వరద బాధితులను పరామర్శించేందుకు బయటకు రాకపోవడంపై అప్పటికే అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టుర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఆ తర్వాత తాజాగా, కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఆయన కనిపించడం లేదంటూ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications