కోదండరామ్‌పై తిట్ల వర్షం: వీడు, వాడు అంటూ కెసిఆర్ వ్యాఖ్యలు

కోదండరామ్‌పై కెసిఆర్ అనుచిత పదజాలం వాడి మరోసారి వివాదాస్పదుడిగా మారారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత కెసిఆర్‌కు చెందుతూ ఉండవచ్చు. తన ఘనతే అని చెప్పుకోవచ్చు.

హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన తన సహజ శైలిలో అలరిస్తూ వచ్చారు.

ఆయన చెప్పిన విషయాల మీద ఏకీభావం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన వాడిన భాష మీద మరోసారి దుమారం చెలరేగే అవకాశం ఉంది. నేరెళ్ల ఘటనలో ఆయన దళితుల విషయంలో చేసిన పొరపాటే మరోసారి చేసినట్లు కనిపిస్తోంది.

కెసిఆర్ లేకుంటే, ఆయన తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస)ని స్థాపించి ఉద్యమంలోకి రాకపోతే తెలంగాణ సాకారమయ్యేదా కాదా అనేది వేరే ప్రశ్న. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పొరపాట్లను ఆయనతో ఏకీభావం లేనివాళ్లు కూడా సమర్థించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడానికే.

కెసిఆర్ ప్రాధాన్యం ఏమిటో తెలుసు...

కెసిఆర్ ప్రాధాన్యం ఏమిటో తెలుసు...

తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ నిర్వహించిన పాత్ర ఏమిటో, ఉద్యమాన్ని ఎలా మండించారో, ఆయన ప్రాధాన్యం ఏమిటో అందరికీ తెలుసు. అందుకు ఆయనపై ఎల్లవేళలా గౌరభావం ఉంటుంది. ఆ ఉద్యమానికి నాయకుడు ఆయనే తప్ప మరొకరు కారు. కానీ, ఇతర నాయకులు నిర్వహించిన పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది. చరిత్రలో అది కూడా రికార్డు కావాల్సిందే. కెసిఆర్ దాన్ని గుర్తించినట్లు వ్యవహరించడం లేదనే బాధ, వేదన చాలా మందిలో ఉంది. ఆయన ఆత్మవిశ్వాసానికి లేదా అతి విశ్వాసానికి అది పరాకాష్ట కావచ్చు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత..

ముఖ్యమంత్రి అయిన తర్వాత..

తెలంగాణ ఆవిర్భవించి, తాను ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఏది చేసినా సమర్థించాల్సిందే అంటే అది కుదరని పనే అవుతుంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యాచరణలతో కొంత మందికి ఏకీభావం ఉండకపోవచ్చు. కాంగ్రెసు, తెలుగుదేశం, ఇతర రాజకీయ పార్టీలను పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ కలిసి వచ్చిన నేతలను, శ్రేణులను తుక్కు కింద జమకట్టడం సమంజమవుతుందా అనేది ప్రశ్న.

పక్కా రాజకీయ పార్టీగా మారిన తర్వాత...

పక్కా రాజకీయ పార్టీగా మారిన తర్వాత...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే కాకుండా ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను కెసిఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. వారందరికీ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉందని భావించాల్సిన ఆగత్యం ఉందా అనేది మరో ప్రశ్న. ప్రస్తుతం తెరాస ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయి, ఇతర పార్టీల్లో ఉన్న అవలక్షణాలను పూర్తిగా అరువు తెచ్చుకుందనేది కాదన లేని నిజం. పలువురు శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరు, వారిపై వస్తున్న విమర్శలు అందుకు తార్కాణం. అందువల్ల తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత పొడసూపే అవకాశాలు లేకపోలేదు. ఈ వ్యతిరేకతను కెసిఆర్ తన ఒక్కడి చిత్తశుద్ధితో, తన నిజాయితీతో, తన నాయకత్వ ప్రతిభతో, తన వాగ్ధాటితో ఎదుర్కోగలననే నమ్మకం ఉంటే ఎవరు చేసేది ఏమీ లేదు. కానీ, ఏదో రూపంలో ఆందోళనలు చెలరేగక మానవు.

కోదండరామ్‌ను ఏమన్నారు...

కోదండరామ్‌ను ఏమన్నారు...

వాడు, వీడు, లంగా, అరే..లాంటి పదాలతో కోదండరామ్‌పై కెసిఆర్ తన వాగ్ధాటిని ప్రదర్శించారు. "నీ సక్కదానికి జీవితంలో సర్పంచ్‌ గా గెలిచినవా? కోదండరాం పిలుపుని చ్చిండట? ఆయన ఎవరు పిలుపినివ్వడానికి ఆయనేమైనా సిఎమ్మా? ఆయనేదో జాతీయ నాయకుడైనట్లు పిలుపిస్తడా? వాడేదో గొప్ప అను కుంటున్నడు. ఏదో బండి కింద కుక్క పోతున్నప్పడు నేనే మోస్తున్న అనుకుంటది కుక్క తీర్గా అలా ఉంది కోదండరాం పని" అని కెసిఆర్ అన్నారు.

కోదండరామ్ అనేవాడు...

కోదండరామ్ అనేవాడు...

"కోదండరాం అనే వాడు... టిఆర్‌ఎస్‌ యెడల విషపూరితమైన వ్యక్తి. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం వీడికి ఇష్టం లేకుండే. నేను తయారు చేసిన లక్షల మంది నాయకుల్లో వీడొకడు. వీడు చేసిందేమీ లేదు తొక్క...నీ జెఎసిలో ఎవలున్నరు. ఎవడన్నా ఉన్నడా?. దిక్కుమాలినోళ్లను పెట్టుకుని సంఘం పెట్టి ఏదో అయిత అనుకుంటే ఐతదా? అమరుల స్పూర్తి యాత్రనా? లంగా రాజకీయ యాత్రనా? నువ్వు చేసేది?. ఆయనేమీ అమాయకుడు కాదు. కాంగ్రెస్‌తో రహస్యంగా కలిశాడు. ఈన సాధించిన ఘనకార్యమేంది తొక్క" అని కెసిఆర్ తిట్టిపోశారు.

కోదండరామ్ మాత్రమే కాదు....

కోదండరామ్ మాత్రమే కాదు....

కోదండరామ్ కార్యాచరణతో ఏకీభావం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కార్యాచరణ సరైందేనని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రపై విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయనను తప్పు పట్టేవారున్నారు. ఆయన మాత్రమే కాదు, కోదండరామ్‌లా తెలంగాణ కోసం పనిచేసినవారు చాలా మంది ఉన్నారు. ఆయన స్థాయిలో పనిచేసి ఉండకపోవచ్చు, కెసిఆర్ మాదిరిగా నాయకత్వ ప్రతిభతో ముందుకు దూసుకురాకపోవచ్చు. తెర వెనక జరిగిన కృషిలో చాలా మంది పాత్ర ఉందనేది సత్యం. ప్రస్తుత పరిణామాలను వారంతా జాగ్రత్తగానే పరిశీలిస్తున్నారు. అది బద్దలు కాకుండా పోతుందా అనేది చూడాల్సి ఉంది.

ప్రతిపక్షాల తీరు వల్ల...

ప్రతిపక్షాల తీరు వల్ల...

ప్రతిపక్షాల బలహీనతల వల్ల, తెలంగాణ ఉద్యమ కాలంలో నిర్వహించిన పాత్ర వల్ల, గత చరిత్ర వల్ల తెలంగాణ ప్రజలకు ఆ పార్టీలపై విశ్వాసం చేకూరడం లేదనేది నిజం. తెలుగుదేశం పార్టీ ఓటు నోటు వ్యవహారంలో తన గోతిని తానే తవ్వుకుంది. కాంగ్రెసు పార్టీలో నాయకుల మధ్య సమన్వయం లేదు. వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలోని ప్రజలకు ప్రస్తుతం ప్రతిపక్షంలో ధీటైన నాయకుడు లేకుండా పోయారనేది నిజం. అందువల్లనే కాకుండా, కెసిఆర్ చేస్తున్న కొన్ని పనుల వల్ల కూడా ఆయనకు తిరుగు ఉండకపోవచ్చు. కానీ, ప్రజలంతా తన వైపు ఉన్నారని కెసిఆర్ నమ్మి అతి విశ్వాసంతో ముందుకు వెళ్తే అది సుదీర్ఘ కాలంలోనైనా చేటు కలిగించవచ్చు.

పదవులకు దూరంగా ఉన్నవాళ్లు...

పదవులకు దూరంగా ఉన్నవాళ్లు...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదవులకు దూరంగా ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకుండా, అసంతృప్తితో రగిలిపోతున్నవాళ్లు ఉన్నారు. పదవులు రాకపోవడం వల్లనే వారు అసంతృప్తితో ఉన్నారని, వారిని లెక్క చేయాల్సిన అవసరం లేదని కెసిఆర్ భావిస్తే కూడా అది పొరపాటే అవుతుంది. కరెంట్ సమస్యను తీర్చడం, నీటి పారుదల ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టడం, ఇతర పథకాలను సజావుగా అమలు చేయడం వరకే ప్రభుత్వంపై వ్యతిరేకత, సానుకూలత అనే అంశాలు పరిమితం కావు. అనేకానేక విషయాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందువల్ల, కెసిఆర్ తన వాదనను వినిపించే సమయంలో కాస్తా మర్యాదకరమైన భాషను వాడితే మంచిది. ఆయన దృష్టిలో తన వెంట ఉన్నవారు మాత్రమే తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నవారు, మిగతా వారంతా అభివృద్ధి నిరోధకులు అంటే సరిపోదు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన వైఖరికి భిన్నమేమీ కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+