తెలంగాణ సకల జనులూ జీరో: కెసిఆర్ అతి విశ్వాసమా, అసహనమా?
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇటీవలి కాలంలో సహనం కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై అసహనంతో ప్రతి ఒక్కరినీ జీరో చేయడం ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.ఆయన మాట
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇటీవలి కాలంలో సహనం కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భావిస్తున్నవారిపై అసహనంతో మొత్తం ఉద్యమంలో ఉడుతా భక్తిగా... ఉడుతా భక్తిగానే పనిచేసిన ప్రతి ఒక్కరినీ జీరో చేయడం ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
కోదండరామ్‌ను తానే తయారు చేశానని చెప్పుకున్నారు. ఆయన లక్ష మందిలో ఒక్కడని వ్యాఖ్యానించారు. కనీస మర్యాద కూడా పాటించకుండా ఆయనపై వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా సోషల్ మీడయాపై కూడా విరుచుకుపడ్డారు.
కెసిఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్రను తుడిచిపెట్టి, తన చరిత్రను మాత్రమే లిఖించాలని అనుకుంటున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. కెసిఆర్ కోదండరామ్‌ను ఒక్కడినే అన్నట్లా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నవారినందరినీ అన్నట్లా అనేది ప్రశ్న. ఆయన మాటలు మాత్రం ప్రతి ఒక్కరికీ తగులుతాయనేది నిస్సందేహం.

ఉద్యమ నేపథ్యం.....
కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ఉద్యమం మండడానికి సిద్దంగానే ఉంది. ఆ నేపథ్యం కెసిఆర్‌కు ఉపయోగపడింది. నిజానికి కెసిఆర్ రూపంలో తగిన సమయానికి, తగిన నాయకుడు తెలంగాణ ఉద్యమానికి లభించాడు. దాంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ నేపథ్యాన్ని తయారు చేసినవాళ్లంతా కెసిఆర్ వస్తారని అనుకున్నవాళ్లేమీ కాదు. ఉద్యమం చేయకతప్పదని భావించి నేపథ్యాన్ని, తగిన వాదనాపటిమనను రూపొందించి భావజాల రంగంలో పనిచేశారు. కెసిఆర్ భాషలో చెప్పాలంటే వాళ్లంతా చిల్లరగాళ్లే.

అప్పుడిలా జరిగింది....
విప్లవ సాహిత్యంతో పాటు దళితమైనారిటీ, స్త్రీవాద సాహిత్యాలు తెలుగులో వస్తున్న కాలం. ఆ కాలంలో తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణకు చెందిన జర్నలిస్టులు, రచయితలు, కవులు ఒక వేదిక మీదికి రావాలనే ప్రయత్నాలు విరివిగా జరిగాయి. ఆ కాలంలో ఓ తెలంగాణ ప్రముఖ కవిని పట్టుకుని ఆంధ్ర ప్రాంతానికి చెందిన విప్లవ సాహిత్య సంఘీభావ కవి పోరంబోకువాళ్లతో కూడుతున్నావని వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఉద్యమ నేపథ్యాన్ని తయారు చేసినవాళ్లు ఆ పోరంబోకుగాళ్లు, చిల్లరగాళ్లే.

సోషల్ మీడియాపై అక్కసు....
సోషల్ మీడియాపై కూడా కెసిఆర్ శుక్రవారంనాటి తన మీడియా సమావేశంలో దుమ్మెత్తిపోశారు. తెలంగాణ ఉద్యమానికి ఎన్నారైల మద్దతును కూడగట్టింది, తెలంగాణకు అనుకూలంగా చేయడానికి అవసరమైన వాదనాపటిమను సమకూర్చింది సోషల్ మీడియానే. సోషల్ మీడియాను తెలంగాణ ఉద్యమంలో వాడుకున్న తీరు అబ్బురపరిచేదే. సోషల్ మీడియా తెలంగాణ ఉద్యమానికి తోడ్పడిన వైనాన్ని కెసిఆర్ తన మాటల ద్వారా పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, ఆన్ లైన్ మీడియాను తొలుత గుర్తించి, ఆ తర్వాత ఆ గుర్తింపును ఆయన వెనక్కి తీసుకుని ఉంటారు. డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమానికి అందించిన చేయూత బహుశా ఆయన దాకా వెళ్లి ఉండకపోవచ్చు.

కెసిఆర్ తీరుపై...
కెసిఆర్ తీరుపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను సమర్థించేవాళ్లు కూడా నొచ్చుకునే విధంగా ఆయన మాటలున్నానేది కాదనలేని విషయం. కోదండరామ్‌ను లక్షల్లో ఒక్కడిగా అభివర్ణించి, ఆయనను జీరో చేయాలనుకున్న కెసిఆర్ తెలంగాణలోని సకల జనులను మాత్రమే కాదు, ఈ రోజు ఆయన ఇచ్చిన పదవులను అనుభవిస్తున్న తెలంగాణ ఉద్యమకారులను కూడా జీరో చేయాలని అనుకుంటున్నారు.

అసహనమా, అతి విశ్వాసమా..
కెసిఆర్ హుందాను కోల్పోయి చేసిన వ్యాఖ్యలు అసహనం నుంచి వచ్చాయా, అతి విశ్వాసం నుంచి వచ్చాయా అనేది ప్రశ్న. బహుశా ఆత్మవిశ్వాసం నుంచి వచ్చి ఉంటాయి. హైదరాబాదు నగరపాలక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఒనగూరిన ఆత్మవిశ్వాసాన్ని తర్వాతి విజయాలు కూడా పెంచాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే, తనకు వ్యతిరేకతే ఉండకూడదనే భావన నుంచి ఆయన అసహానానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారు. తనను ప్రశ్నించకూడదనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications