కెసిఆర్ ప్రభుత్వం పరార్: 'తెలంగాణ' తర్వాత అందరూ కలిశారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విపక్ష పార్టీలన్నీ ఒకే వేదిక పైకి వచ్చాయి. రైతు ఆత్మహత్యల పైన సభలో ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. అయితే, తెలంగాణ ఏర్పాటు తర్వాత విపక్షాలు పూర్తిగా ఏకతాటి పైకి రావడం, ఉమ్మడిగా నిరసన గళమెత్తడం ఇదే మొదటిసారి.
రైతు ఆత్మహత్యల పైన రెండు రోజుల పాటు సభలో చర్చ జరిగింది. గురువారం నాడు విపక్షాల ఆందోళన నేపథ్యంలో... సభను హఠాత్తుగా సోమవారానికి వాయిదా వేశారు. దీనిపై విపక్షాలు అవాక్కయ్యాయి. ప్రభుత్వం రైతు ఆత్మహత్యల విషయంలో సమాధానం చెప్పలేక వాయిదా వేయించిందని ఆరోపిస్తున్నారు.
దీంతో, సభను అర్థాంతరంగా వాయిదా వేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వైసిపి సీపీఎం, సీపీఐలు గురువారం ఆందోళనకు పూనుకున్నాయి. సభ వాయిదా ప్రకటన వెలువడగానే విపక్ష పార్టీల నేతలు సీఎల్పీ నేత జానారెడ్డి ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

ఉమ్మడిగా ఆందోళన చేయాలని నిర్ణయించారు. నినాదాలు చేస్తూ బయటికి వచ్చి గన్‌పార్క్ ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. విపక్షాల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకు వెళ్లారు.
గురువారం శాసన సభ ఏడు నిమిషాలకే వాయిదా పడింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు లాబీ నుంచే వెనుదిగిగారు. రైతులకు ఊరటనిచ్చి రుణమాఫీ పైన స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలు అసెంబ్లీ గేట్ వద్ద, నాంపల్లి పోలీసు స్టేషన్లో ఆందోళనకు దిగారు.
కేసీఆర్ నిజాంను మించిపోయాడు: నారాయణ
అణచివేతలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిజాంను మించిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. చలో అసెంబ్లీకి బయల్దేరిన వారిని అక్రమంగా అరెస్టు చేశారని, సభలో ఎమ్మెల్యేల గొంతు నొక్కేందుకూ పూనుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications