వైయస్ గడ్డి తింటే, కేసీఆర్ పెండ తింటారా, అమరావతిలో బిర్యానీ తిన్నావుగా: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి గురువారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఏపీతో వివాదాలు ఉంటే కేసీఆర్ ఎందుకు చర్చలు జరపడం లేదని నిలదీశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల పైన మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించాలన్నారు. కేసీఆర్‌ను ప్రజలు ప్రశ్నించే రోజు త్వరలో రానుందని చెప్పారు.
కేసీఆర్ కుటుంబం పెండలో పురుగులా తయారైందని మండిపడ్డారు. దానికి బంగారు తెలంగాణ అని ముసుగు తొడిగారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి గడ్డి తిన్నాడని కేసీఆర్ పెండ తినాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు చూస్తే కసబ్‌నూ ఆదర్శంగా తీసుకునేలా ఉన్నారన్నారు.
టీఆర్‌ఎస్ సర్కార్‌ను తాము కూల్చే ప్రయత్నం చేశామని అసదుద్దీన్ చెప్పడానికి ప్రాతిపదిక ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ జీవితం అబద్ధాలమయమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఇతరుల నుంచి నేర్చుకునే స్థితిలో టీడీపీ లేదన్నారు.

టీఆర్‌ఎస్ తెలంగాణకు పట్టిన చెద అని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుట్ర చేసి ఉంటే అమరావతికి వెళ్లి బిర్యానీ ఎందుకు తిన్నారని ప్రశ్నించారు. హైకోర్టు, సాగునీటి ప్రాజెక్టులపై గవర్నర్ సమక్షంలో చర్చకు సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి చర్చకు చంద్రబాబు వస్తారు, తేదీ కేసీఆర్ నిర్ణయించాలని అన్నారు.
సొంత పార్టీని దిద్దుకోవడం చేతకాక: హరీష్ రావు
సొంత పార్టీని చక్కదిద్దుకోవడం చేతకకా తమ పైన విమర్శలు గుప్పించడం ఏమిటని మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ పైన ధ్వజమెత్తారు. తమ ప్రభు్తవం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే కాంగ్రెస్ పార్టీ నేతలు వస్తున్నారన్నారు.
దిగ్విజయ్ సింగ్ టీఆర్‌ఎస్‌ను విమర్శించడం సరికాదన్నారు. సొంత పార్టీని సరిదిద్దుకోలేని దిగ్విజయ్ సింగ్ టీఆర్‌ఎస్‌ను విమర్శించడం తగదన్నారు. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే ఆ పార్టీ నేతలు తమ పార్టీని విమర్శిస్తున్నారన్నారు.
ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నపుడు వాళ్లు ఎందుకు మాట్లాడలేదన్నారు.
స్మార్ట్ సిటీ పైన వినోద్
కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇందు కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలని సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి మోడీని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కోరారని గుర్తు చేశారు. కరీంనగర్‌ను గొప్ప స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.












Click it and Unblock the Notifications