కేసీఆర్ దమ్ము దేశమంతా చూసింది!: రేవంత్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్, కీలక వ్యాఖ్యలు
నాగర్‌కర్నూల్: కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందని.. కొత్తగా చూపాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదని ప్రతిపక్ష నేతలనుద్దేశించి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు ప్రజలు బొంబాయికి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని కేసీఆర్ (KCR) విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించానని.. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే.. విజయవంతం అయ్యాను అని కేసీఆర్ చెప్పారు.

24 గంటలు రాష్ట్రంలో కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని ఆనాడు జానారెడ్డి సవాల్ విసిరారని గుర్తు చేశారు కేసీఆర్. 24 గంటల కరెంటు ఇచ్చి చూపించాక వారి సవాల్ ఏమైందని ప్రశ్నించారు. ఇంటింటికీ నల్లానీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణేనని అన్నారు. ఇప్పుడు దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రైతులు కరెంట్ కోసం ధర్నాలు చేస్తున్నారన్నారు. ఇండియా మొత్తంలో ప్రధాని రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
రైతు బంధు, దళితబంధు తీసుకొచ్చిందే కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. ధరణి లేకపోతే రైతులు నష్టపోతారని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు, దళితబంధు పోతాయన్నారు. ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. లేదంటో అంధకారంలోకి పోతామని హెచ్చరించారు.
ఒకడు కొడంగల్ రమ్మంటున్నడు.. ఒకడు గాంధీ బొమ్మ దగ్గరికి రమ్మంటుండు
— BRS Party (@BRSparty) October 26, 2023
కేసీఆర్ దమ్ము ఏందో దేశం మొత్తానికి తెలుసు 🔥
- అచ్చంపేట సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. #KCROnceAgain pic.twitter.com/RQGLRVyAmr
'కొడంగల్‌కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..?' అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 'కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసింది. మీరంతా కేసీఆర్ దమ్ము(ప్రజలను ఉద్దేశించి).. ఈ దమ్ము గట్టిగా బయలెల్లుతే దుమ్ము దుమ్ము లేస్తది. లెవ్వాలి. నవంబర్ 30న దుమ్ము రేగాలి. బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో బాలరాజు గెలిచి రావాలి' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications