కేసీఆర్ మంత్రాంగం: హైదరాబాద్‌కు మమత బెనర్జీ: స్టాలిన్‌కు ఫోన్: ఉద్ధవ్ సైతం సై: కీలక భేటీకి
హైదరాబాద్: దేశంలో మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇదివరకెప్పుడూ లేని వేగం ఇది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్ యూపీఏకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్.. దేశ రాజకీయ తెరపైకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టేలా కనిపించట్లేదు. ఈ దిశగా మరో కీలక ముందడుగు పడబోతోంది. హస్తిన వేదికగా కొత్త కూటమి ఏర్పాటు దిశగా ప్రాథమిక భేటీ ఏర్పాటుకాబోతోంది.

మూడో కూటమి ఏర్పాటు కోసం..
ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయ సంకీర్ణ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడానికి సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు- దీనికోసం పావులు కదిపారు. జాతీయ స్థాయిలో పలువురు ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులను కలుసుకున్నారు. అప్పట్లో వన్ టు వన్ చర్చలకు మాత్రమే పరిమితం అయ్యాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఆ చర్చలను దాటి ముందుకు సాగలేకపోయాయి.

మరో ముందడుగు..
ఇప్పుడా పరిస్థితిని దాటుకున్నట్టే.. మూడో కూటమి ఏర్పాటు విషయంలో ఉన్న పరిధులు, పరిమితులను అధిగమించినట్టే. ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు త్వరలోనే జట్టు కట్టనున్నారు. దీనికోసం దేశ రాజధానిలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఆయా ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరవుతారని తెలుస్తోంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మార్చి 10వ తేదీ తరువాత కూటమి యత్నాలు మరింత ముమ్మరంగా సాగే అవకాశాలు లేకపోలేదు.
స్టాలిన్‌కు మమత బెనర్జీ ఫోన్ కాల్..
ఈ పరిణామాల మధ్య డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీదీ తనకు ఫోన్ చేశారని, త్వరలో ఢిల్లీ వేదికగా భేటీ కావడానికి సంసిద్దంగా ఉండాలంటూ సూచించారని స్టాలిన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. చర్చలకు సంబంధించిన అజెండాను రూపొందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాని పేర్కొన్నారు.

గవర్నర్ల వ్యవస్థపై..
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు తమ పరిధులను దాటి వ్యవహరిస్తున్నారని మమత బెనర్జీ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోన్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో తరచూ జోక్యానికి పాల్పడుతున్నారని, ఈ విషయం మీద చర్చించడానికి ఢిల్లీకి రావాలంటూ విజ్ఞప్తి చేశారని స్టాలిన్ చెప్పారు. ఈ భేటీకి హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని మమత బెనర్జీకి బదులిచ్చినట్లు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా.. తమ గవర్నర్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

కేసీఆర్‌కూ ఫోన్‌కాల్..
మరోవంక- ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటులో భాగంగా.. కేసీఆర్‌తో సమావేశం కావడానికి మమత బెనర్జీ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. మమత బెనర్జీ తనకు ఫోన్ చేశారని కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. దోసె తినాలని ఉందని మమత బెనర్జీ కోరగా.. హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. ఏ క్షణంలోనైనా మమత- హైదరాబాద్‌లో అడుగు పెట్టొచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఉద్ధవ్ కోసం..
శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సైతం తన సంకేతాల కోసం ఎదురు చూస్తున్నారంటూ కేసీఆర్ చెప్పారు. త్వరలోనే తాను ఆయనను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. ముంబై వెళ్లి ఉద్ధవ్ థాకరేను కలుస్తానని పేర్కొన్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత- ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగలడం ఖాయమని, బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత.. వారిని కూడా కలుపుకొంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications