KCR మాస్ వార్నింగ్! డీలిమిటేషన్ పై కేంద్రానికి స్ట్రాంగ్ మెసేజ్
మహిళా రిజర్వేషన్ల పట్ల తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూనే, దాని ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే 'డీలిమిటేషన్' ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లోనే(2023) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా సాధికారతకు తాము ఎప్పుడూ పెద్దపీట వేస్తామని, 2011లోనే అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేశామని గుర్తుచేసిన ఆయన.. డీలిమిటేషన్ విషయంలో మాత్రం కేంద్రం అనుసరించబోయే వ్యూహంపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు అది శాపంగా మారుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్, హరీష్‌రావులతో నిర్వహించిన కీలక భేటీలో ఆయన ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల గొంతు నొక్కేలా సీట్ల కేటాయింపు ఉంటే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

గణాంకాలతో గెలుపు పిలుపు!
ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు సుమారు 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. ఒకవేళ 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచితే, ఈ వాటా తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందని కేసీఆర్ లెక్కలతో వివరించారు. దక్షిణాది సీట్ల శాతం తగ్గకుండా, ప్రస్తుతం ఉన్న స్థానాలను కనీసం 50 శాతం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, అప్పటివరకు తొందరపడి ఎలాంటి మద్దతు తెలపవద్దని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు.
ఢిల్లీకి వినిపించేలా గళం!
"మేమంతా గర్వించదగ్గ భారతీయులం.. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు ప్రతినిధులం. మా ప్రజల గొంతును చట్టసభల్లో అణిచివేస్తుంటే చూస్తూ ఊరుకోం" అంటూ కేసీఆర్ అప్పట్లోనే కుండబద్ధలు కొట్టారు. ఒకవేళ దక్షిణాదికి అన్యాయం జరిగితే, ఇది కేవలం రాజకీయ పోరాటంగా మిగిలిపోదని.. ఇదొక భారీ ప్రజా ఉద్యమంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. "ఢిల్లీ పాలకులు వివేకంతో ఆలోచిస్తారని ఆశిస్తున్నాం" అంటూ ఆయన చేసిన ట్వీట్ అప్పట్లో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.
మొత్తానికి, మహిళా రిజర్వేషన్ల అమలును స్వాగతిస్తూనే.. దాని ముడిపడి ఉన్న డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికిని దెబ్బతీయకూడదన్నదే కేసీఆర్ ప్రధాన ఉద్దేశం.












Click it and Unblock the Notifications