కేసీఆర్‌కు ఓటమి తప్పదు, టీఆర్ఎస్‌కు 15 సీట్లే: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాసర ఐఐఐటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను, వరద బాధితుల సమస్యలను పట్టించుకోకుండా.. సీఎం కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

యాదాద్రి నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర
కాగా, బండి సంజయ్ చేపడుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం(ఆగస్టు 2) నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. యాదాద్రి పుణ్య క్షేత్రం నుంచి భద్రకాళి ఆలయం వరకు 24 రోజుల పాటు యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

అందుకే నా సంగ్రామ యాత్ర: బండి సంజయ్
మంగళవారం ఉదయం 11 గంటలకు యాదాద్రిలో సభ నిర్వహించిన తర్వాత నరసింహస్వామి సన్నిధి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఐదు జిల్లాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర 24 రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. యాదాద్రి నరసింహస్వామి సన్నిధానం నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజల కష్టాల గురించి తెలుసుకోవడానికి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికే ఈ యాత్ర అని చెప్పారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎన్నికల మెనిఫేస్టో రూపొందిస్తామని బండి సంజయ్ తెలిపారు.

కేసీఆర్ ఓటమి ఖాయం, టీఆర్ఎస్‌కు 15 సీట్లేనన్న బండి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కేవలం 15 సీట్లే గెలుస్తుందన్న బండి సంజయ్.. ఆ 15 స్థానాల్లో కేసీఆర్ ఉండరని అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ అధిష్టానం నిర్ణయిందన్నారు. తెలంగాణపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందని బండి సంజయ్ వివరించారు. తెలంగాణ ప్రజలకు కూడా బీజేపీపై నమ్మకం ఏర్పడిందని చెప్పారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications