Rythu bandhu: రైతుబంధు నిధులకు అడ్డుపడొద్దు-ఈసీని కోరిన బీఆర్ఎస్..
తెలంగాణ ఎన్నికల వేళ రైతు బంధు రూపంలో అధికార బీఆర్ఎస్ కు ఊరట లభించినట్లే లభించి దూరమైంది. రైతు బంధు పథకం కింద విడుదల చేసే నిధుల్ని లబ్దిదారుల ఖాతాల్లో వేసేందుకు ఈ మధ్యే ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ సర్కార్ కు ఎన్నికల వేళ భారీ ఊరట లభించింది. అయితే ఈసీ కొన్ని షరతులతో ఈ అనుమతి ఇచ్చినా దాన్ని మంత్రి హరీష్ రావు ఉల్లంఘించి పదే పదే ప్రచారం చేసుకోవడంతో దీన్ని వెనక్కి తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయంతో షాక్ కు గురైన బీఆర్ఎస్ నేతలు ఇవాళ మరోసారి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. వాస్తవానికి ఈ నెల 28లోపు రైతు బంధు నిధుల విడుదల పూర్తి చేయాలని గతంలో ఈసీ ప్రభుత్వానికి గడువు విధించింది. అయితే ఈసీ షరతుల్ని మంత్రి హరీష్ రావుతో పాటు మరికొందరు నేతలు ఉల్లంఘించారన్న కారణంతో ఈసీ నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.

దీంతో బీఆర్ఎస్ నేతలు వెంటనే ఈసీని ఆశ్రయించారు. రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు రైతు బంధు పథకం నిధుల విడుదలపై ఇచ్చిన తాజా ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పేరుతో రైతు బంధు నిధుల విడుదలను అడ్డుకోవద్దని పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
ఎందుకంటే రేపటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. మరో మూడు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇంత కీలక సమయంలో రైతు బంధు నిధుల విడుదలకు మరోసారి ఈసీ అనుమతివ్వడం కష్టమే. దీంతో ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications