ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యకు తండ్రి లైంగిక వేధింపులు: ఖమ్మం ఫ్యామిలీ హత్య వెనుక మిస్టరీ ఇదీ..

ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా.. గౌరవంగా జీవనం గడుపుతున్న కుటుంబం అది. గ్రామంలో గుర్తింపు ఉంది. ఆ ఇంట్లో కోడలిని కుమార్తెగా చూసుకోవాల్సిన వ్యక్తి.. చెడు ఆలోచనలతో వేధించసాగాడు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా.. గౌరవంగా జీవనం గడుపుతున్న కుటుంబం అది. గ్రామంలో గుర్తింపు ఉంది. ఆ ఇంట్లో కోడలిని కుమార్తెగా చూసుకోవాల్సిన వ్యక్తి.. చెడు ఆలోచనలతో వేధించసాగాడు. మామతో తాను పడుతున్న ఇబ్బందుల్ని బాధితురాలు అత్త, భర్తకు చెప్పుకోవడం.. వారు వారించినా.. ధోరణి మారని పరిస్థితుల నేపథ్యంలో ఇంట్లో తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

పరువుగా బతుకుతున్న కుటుంబంలో ఈ గొడవలు పల్చన చేస్తున్నాయని భావించి అందుకు బాధ్యుడైన తన తండ్రిని చంపేయాలనుకున్నాడు ఆ పెద్ద కొడుకు. తానూ చావాలని నిర్ణయించుకున్నాడు. అంతటితో ఆగకుండా మూర్ఖంగా కుటుంబాన్ని అంతటినీ నిర్జీవంగా చేయాలనుకున్నాడు. ఫలితం.. ఆరు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇద్దరు పెద్దలు చేసిన తప్పిదానికి అమాయక చిన్నారులూ బలయ్యారు. మంగళవారం అర్ధరాత్రి పాలేరు జలాశయం అనుసంధానిత కాలువలో ఐదుగురి హత్యకు, మరొకరి ఆత్మహత్యకు ఇది కారణమైంది.

సాఫీగా సాగుతున్న జీవితం..

సాఫీగా సాగుతున్న జీవితం..

జీళ్లచెర్వులో మేళం వాయించే వృత్తితో జీవనం గడుపుతున్న షేక్‌ పెంటుసాహెబ్‌కు షేక్‌ సలీం, షేక్‌ లాల్‌సాహెబ్‌ ఇద్దరు కుమారులు. సలీం వివాహం పదేళ్ల క్రితం తిరుమలాయపాలెం మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన షేక్‌ రజియాతో జరిగింది. వారికి షహనాజ్‌, నస్రీనా అనే ఇద్దకు కుమార్తెలు. సలీం ఒక విత్తన కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. మంచి వేతనంతోపాటు గ్రామంలో గౌరవంగా జీవిస్తున్నారు. తనకు ఓ స్థాయిలో జీతభత్యాలు వస్తుండటంతో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తితోపాటు ఇటీవల మరో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. పెంటుసాహెచ్‌ మేళం వాయించే పనులతోపాటు వ్యవసాయ పనులు చూస్తుండగా, అతని చిన్న కొడుకు లాల్‌సాహెబ్‌ కొంతకాలం ఆటో నడిపి ఇటీవల నుంచి ఖమ్మంలోని ఒక విత్తన కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌ వద్ద పనిచేస్తున్నాడు. ఆ ఇంటి ఇల్లాలు మహబూబ్‌బీ కూలీ పనులు చేస్తుండగా, కోడలు రజియా గృహణి. సలీం పిల్లల్ని ఒక ప్రయివేటు పాఠశాలలో చదివించుకుంటున్నారు.

కల్లోలం రేపిన పెడ ధోరణి..

కల్లోలం రేపిన పెడ ధోరణి..

కొద్దికాలంగా కుటుంబ పెద్ద పెంటుసాహెబ్‌లో పెడ ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఇవే కుటుంబంలో కల్లోలం రేపాయి. మద్యం అలవాటున్న పెంటుసాహెబ్‌, ఇంట్లో ఉన్న కోడలితో అనుచితంగా ప్రవర్తించసాగాడు. ఆమెను లైంగికంగా వేధించసాగాడు. ఆమె తీవ్ర మనస్తాపానికి గురై భర్తకు, అత్తకు తన ఇబ్బందులను చెప్పుకుంది. ఈ క్రమంలో సలీం, తన భార్య, పిల్లలతో కొంతకాలం వేరే ప్రాంతంలో ఉండి మళ్లీ సొంత ఇంటికి వచ్చారు. అయినా తండ్రి ఆలోచనల్లో మార్పు లేకపోవడంతో సలీం ఒకటీరెండు సార్లుతండ్రిపై చేయి చేసుకున్నాడు. ఒక దశలో తండ్రి చేయి విరిగింది. తన కొడుకు మూలంగా చేయి విరిగిందంటూ గ్రామంలో చెప్పుకోవడంతో సలీం మానసికంగా కుంగిపోయాడు. మూడు రోజుల క్రితం కూడా ఇంట్లో గొడవలు జరిగాయి. తరచూ గొడవలతో గ్రామంలో పరువు పోతున్నదని భావించిన సలీం, ఈక్రమంలో తన తండ్రిని చంపి, తానూ చావాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ చనిపోతే.. తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని భావించి వారిని కూడా హతమార్చాలనే నిర్ణయానికి వచ్చాడు.

పథకం ప్రకారం తరలింపు

పథకం ప్రకారం తరలింపు

తమ్ముడు లాల్‌సాహెబ్‌ మినహా కుటుంబ సభ్యులను నీటిలో తోసేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సలీం.. పథకం ప్రకారం అందరినీ పాలేరుకు తరలించాడు. తమ్ముడిని కాపాడుకునేందుకు పాలేరు నుంచి ఇంటికి పంపించేశాడు. తొలుత ద్విచక్ర వాహనంపై తండ్రి, ఇద్దరు కుమారులు జలాశయం వద్దకు వచ్చారు. తల్లి, వదిన, పిల్లల్ని తేవాలంటూ తన తమ్ముడిని మళ్లీ ఇంటికి పంపాడు. అతను వారందరినీ తీసుకొచ్చేసరికి తండ్రిని నీటిలోకి నెట్టేశాడు. తల్లి, వదిన, పిల్లల్ని తెచ్చిన సలీం.. తండ్రి గురించి సోదరునితో వాకబు చేయగా బహిర్భూమికి వెళ్లాడని మభ్యపెట్టాడు. ఆ తరువాత, పూజ సామగ్రి మర్చిపోయానని వెళ్లి తేవాల్సిందిగా అక్కడి నుంచి పంపించాడు. లుంగీని చింపిన వస్త్రంతో తల్లి, భార్యను కలిపి కట్టేసి, ఇద్దరు చిన్నారులను కలిపి కట్టేసి కాలువలోకి నెట్టేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. రాత్రివేళ జనసంచారం లేని ప్రదేశాన్ని ఎంచుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఎంపిక చేసుకున్న స్థలం ప్రధాన రహదారికి 100 మీటర్ల లోపలికి ఉండటంతో ఏం జరుగుతుందో రహదారిపై వచ్చీపోయే వారికి తెలిసే అవకాశం లేదు.

రోదించిన జీళ్లచెర్వు..

రోదించిన జీళ్లచెర్వు..

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతితో జీళ్లచెర్వులో విషాదం మిన్నంటింది. సమాచారం తెల్లారిన తర్వాతే అందరి దృష్టికి రావడంతో పాలేరు జలాశయం ప్రాంతం జనసంద్రంగా మారింది. వందలాది మంది జీళ్లచెర్వు వాసులు, పెద్ద ఎత్తున మహిళలు ఘటన స్థలానికి వచ్చారు. ఆత్మీయంగా ఉండే కుటుంబమంటూ మహిళలు బిగ్గరగా ఏడ్చారు. సమీప గ్రామాలనుంచి కూడా వందలాది మంది వచ్చి మృతదేహాలను పరిశీలించారు. చిన్నారులిద్దరి మృతదేహాలను చూసి ఏడ్చారు. మత్స్యకారులు బత్తుల ఉప్పయ్య, రామయ్య,చాపల రామన్న, వల్లెపు రామయ్య తెప్పలతో వచ్చి మృతదేహాలను 10 అడుగుల లోతున్న నీటిలోనుంచి వెలికితీశారు. మృతదేహాలను బయటకు తీయడంలోనూ, చాపల్లో చుట్టి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంలోనూ పోలీసు సిబ్బందికి స్థానికులు సహకరించారు. శవపరీక్ష అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మృతదేహాలను జీళ్లచెర్వులోని స్వగ్రామానికి తరలించగా, వందలాది మంది గ్రామస్థులు, బంధువులు తరలివచ్చారు. మృతదేహాలను చూసి పెద్దపెట్టున రోదించారు. గ్రామస్థులంతా ఆత్మీయ కుటుంబాన్ని పోగొట్టుకున్నామంటూ రోదించారు.

ప్రతిఘటించలేదా?

ప్రతిఘటించలేదా?

కాలువ వద్ద తామిద్దరినీ కలిపి కట్టేస్తుంటే తల్లి, అత్త ప్రతిఘటించ లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి, స్థానికులు కొందరు ఇలా సమాధానం చెబుతున్నారు. అంత రాత్రి వేళ స్నానాలేమిటి..? పూజలేమిటి..? అని ఆ కుటుంబీకులు ప్రశ్నించలేదు. ఒకొక్కరుగా కాకుండా, ఇలా ఇద్దరు కలిసి నడుముకు వస్ర్తం గట్టిగా కట్టుకుని నీళ్లలోకి దిగి స్నానం చేయాలని తల్లికీ.. భార్యకూ కలిపి లుంగీ గుడ్డ ముక్కతో కట్టాడు. పిల్లలిద్దరికీ అలాగే కట్టాడు. అందుకే వారికి అనుమానం రాలేదు. కాలువలోకి దిగబోతున్న తల్లి, భార్యను నీళ్లలోకి బలంగా నెట్టేశాడు. ఆ వెంటనే పిల్లలను కూడా నెట్టేశాడు. ఆ తరువాత తాను కూడా దూకాడు.

English summary
Khammam family murder mystery revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X