అవినీతిలో రేవంత్ మార్క్: ‘గాడిద గుడ్డు’కు కిషన్ రెడ్డి కౌంటర్
కాంగ్రెస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శులు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. హామీలు అమలు చేయమంటే ప్రజలకు గాడిదగుడ్డు చూపిస్తాన్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి పరిస్థితి లేదన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోయినా.. అమలు చేసినట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి హస్తం గుర్తును కాకుండా.. గాడిద గుడ్డును నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐదు నెలల్లోనే అవివీతి మార్కు చూపిస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

స్టీల్‌ప్లాంట్‌పై రేవంత్‌రెడ్డి ఇచ్చిన విధంగానే గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. రైల్వేలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని దుయ్యబట్టారు. ఇప్పటికే సైనిక్ స్కూల్ మంజూరైందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ, సీఎంను ప్రశ్నిస్తున్నానని.. ఏం మార్పు మెుదలైందో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి, సోనియాగాంధీ కుటుంబ పాలన వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు ఇంకా రాలేదని స్పష్టం చేశారు. నియామకాలకు సంబంధించి రేవంత్‌రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. గత నోటిఫికేషన్లనే రేవంత్‌రెడ్డి తాము భర్తీ చేసినట్లుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని మండిపడ్డారు.
మరోవైపు, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతోందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఎలాగైనా గెలవాలనే వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంతలా దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దు ఎవరూ చేయలేరని ప్రధాన మంత్రి మోడీనే స్వయంగా చెప్పినా.. రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాపై ఫేక్ వీడియోలు సృష్టించారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications