తెలంగాణలో మరో ఫ్యామిలీ అధికారంలోకి వచ్చిందంతే: కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం పోయి సోనియా ఫ్యామిలీ రావడం తప్పితే రాష్ట్రంలో వచ్చిన మార్పేం లేదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఉదయం చేపట్టిన దీక్ష కిషన్ రెడ్డి, సాయంత్రం విరమించారు.
తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ఇంకా అమలు చేయట్లేదని కిషన్‌రెడ్డి (Kishan Reddy)ఆరోపించారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఇంకా చేయలేదని విమర్శించారు. హామీలు ఎందుకు అమలు చేయట్లేదని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కిషన్ అన్నారు.

రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధులు జమకావడంలో ఏమైనా పొరపాట్లు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తెలంగాణ రైతాంగానికి ఇబ్బందుల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 9904119119 అందుబాటులో ఉంచుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన గ్యారంటీల అమలుకు ప్రణాళిక ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్, పంట నష్టపోయిన అన్నదాతలకు రూ.25,000 ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరుతో కర్షకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. గజదొంగలు పోయి ఇప్పుడు ఘరానా దొంగలు వచ్చారని కాంగ్రెస్ పార్టీపై విమర్శించారు. కొత్తగా తీసుకున్న అప్పులను డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇంకా రుణమాఫీ ఎందుకు చేయలేదో ముఖ్యమంత్రి అన్నదాతలకు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీవన్ని బోగస్ డిక్లరేషన్ లని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం దేశంలో యూరియా కొరత లేకుండా చేసిందని, రైతుల మేలు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications