రైతుబంధు కన్నా.. మేమిచ్చే ఎరువుల సబ్సిడీనే ఎక్కువ: దేశ్ కీ నేత ఎలా అంటూ కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ్ కీ నేత అని ఫ్లెక్సీలు పెట్టించుకుంటే సీఎం కేసీఆర్ దేశానికి నేత కాలేరని, ప్రజలు గుర్తిస్తేనే అవుతారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పరిస్థితి ఉట్టికెగుర లేనమ్మ ఆకాశానికెగిరిన్నట్లుందని చురకలంటించారు.
మహారాష్ట్రలో కొంత మంది పనికిమాలిన వాళ్లకు ఫోన్లు చేస్తూ పార్టీలో చేర్చుకుంటూ ప్రధానిని విమర్శిస్తారా? అని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబానికి పొద్దున లేస్తే ప్రధాని మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని.. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

దేశంలో ఎన్నో రాష్ట్రాలు పంటల బీమాను అమలు చేస్తున్నాయని.. తెలంగాణ కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు బంధు కింద ఎకరాకు ఏటా రూ.10 వేలిస్తున్నా మని డబ్బా కొట్టుకోవడం తప్ప బీఆర్ఎస్ సర్కారు రైతులను పట్టించుకోవడం లేదన్నారు కిషన్ రెడ్డి. చేతికొచ్చిన పంట వర్షానికి కొట్టుకుపోయినా రైతులకు ప్రభుత్వ సహకారం లేదని విమర్శించారు. రాష్ట్రా న్ని సలహాదులకు వదిలేసి మహారాష్ట్రలో బీఆర్ఎస్ బ్రాంచి పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు
ప్రగతిభవన్ బుల్లెట్ ప్రూఫ్ అద్దాల నుంచి కేంద్రం మీద రాళ్లు వేస్తే అవి మీ మీదే పడతాయని చురకంటించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ రోజూ చెప్పే రైతు బంధు కంటే తామిచ్చే ఎరువుల సబ్సిడీయే ఎక్కువని.. ఎకరాకు ప్రతి ఏటా రూ. 18,254 ఇస్తున్నామని తెలిపారు. తామిచ్చే ఎరువుల సబ్సిడీ కౌలు రైతులకు కూడా అందు తోందని, కేసీఆర్ రైతు బంధు ధనికులకు మాత్రమే అందుతోందన్నారు.
రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు ప్రధాని వస్తే రారు కానీ.. పొద్దున లేస్తే నాందేడ్ కు వెళుతున్నారని కేసీఆర్‌పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఉచిత ఎరువులిస్తామని చెప్పి మోసం చేసి కేసీఆర్ రైతులకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి కనీస మద్దతు ధరను వంద శాతం పైగా పెంచామని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన మొదటి రోజే దళిత సీఎం హామీని తుంగలో తొక్కి, ఇప్పటివరకు ఎన్నో హామీలిచ్చి విస్మ రించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications