సింహయాజీని కలిసిన మాట నిజమే కానీ,..: కోదండరాం
హైదరాబాద్: టీఎర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడైన సింహయాజీని కలిసినట్లుగా వస్తున్న ఆరోపణలపై తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. తాను ఆరు నెలల క్రితం సింహయాజీని కలిశానని స్పష్టం చేశారు. అయితే, అందులో ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు.
కేవలం ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే ఆయనను కలిశానని కోదండరాం తెలిపారు. రాజకీయ జీవితంలో అనేక మందిని కలుస్తుంటామని ఆయన చెప్పారు. సింహయాజీని తిరుపతికి చెందిన స్వామిజీగా తనకు పరిచయం చేశారని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక గురువు సింహయాజీని కలిశానని కోదండరాం స్పష్టం చేశారు. సింహయాజీకి రాజకీయాలతో సంబంధం ఉన్నట్లు ఇప్పుడే తెలుస్తోందన్నారు. ప్రజలందరూ దీనిని అర్థం చేసుకోవాలని కోదండరాం విన్నవించారు.
కాగా, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ముగ్గురు ప్రధాన నిందితుల్లో సింహయాజీ కూడా ఒకరు కావడం తెలిసిందే. రామచంద్రభారతి, నందకుమార్ లతోపాటు సింహయాజీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వీరిని విచారించింది. అయితే, తాజాగా, ఎమ్మెల్యేలకు కేసులో ఈ ముగ్గురు నిందితులకు కోర్టు నుంచి బెయిల్ లభించింది.
ఎమ్మెల్యే ఎర కేసులో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆరోపణలు, విమర్శలు పరస్పరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications