ఇంత తొందరెందుకు, ఆగలేరా: కేసీఆర్‌పై మండిపడ్డ కోదండరాం
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వానిది తొందరపాటు చర్య అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం శనివారం నాడు అన్నారు. రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా దసరా నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభించడం తొందరపాటు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాభిప్రాయ సేకరణ, సమగ్ర నివేదిక లేకుండా, సామాజిక, భౌగోళిక, సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జిల్లాల్ని విభజించడం అన్యాయమన్నారు. కొత్త చట్టం రూపొందించే వరకు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం జిల్లాల ఏర్పాటు జరిగితే తెలంగాణలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందన్నారు. తాత్కాలిక అవసరాల కోసం తీసుకు వచ్చిన 1974 జిల్లాల చట్టం ఒకటి రెండు జిల్లాల ఏర్పాటుకు మాత్రమే పనికొస్తుందన్నారు.

ప్రభుత్వ వైఖరి ఏకపక్షంగా ఉందని, రాజ్యాంగ స్ఫూర్తికి అది విరుద్ధమన్నారు. రాజకీయ పార్టీలు ఇష్టానుసారం కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల రద్దుకు మార్గం చూపినట్లు అవుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి, తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ముందుకు వెళ్లాలన్నారు.
కమిషన్ లేదా కమిటీ ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలతో సమగ్ర నివేదిక ఆధారంగా విభజిస్తే గందరగోళ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ప్రజల మధ్య వైషమ్యాలు తలెత్తేవి కావన్నారు. స్వాతంత్రం తరువాత ఏర్పాటైన జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కొత్త జిల్లాలపై తుదినిర్ణయం ప్రజాభీష్టం మేరకు జరగాలన్నారు. షెడ్యూలు ప్రాంతాల పరిపాలన సమగ్రత పెంపొందించేందుకు ఆయా ప్రాంతాలను ఎక్కడికక్కడ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications