బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకంటే?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదన్నారు ఆ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను డబ్బు కోసం, పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. పార్టీ మారుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కోమటిరెడ్డి.. అక్టోబర్ 27న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
మొయినాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడినట్లు తెలిపారు. రాష్ట్ర సాధనలో ఎంపీగా తనవంతు పాత్ర పోషించినట్లు చెప్పారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్న నాటి నుంచే.. బీఆర్ఎస్ సర్కారుపై తన పోరాటం ప్రారంభమైందన్నారు.

100 మంది బీఆర్ఎస్ నేతలు ఎంత కష్టపడితే మునుగోడు ఉపఎన్నికలో ఆ పార్టీ గెలిచిందన్నారు రాజగోపాల్. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని అప్పుడు భావించినట్లు తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలు చూసి బీజేపీపై అప్పుడు నమ్మకం కలిగిందన్నారు. ప్రస్తుతం బీజేపీ నాయకత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు.
కేసీఆర్ అవినీతిపై విచారణ జరపకపోవడం.. లిక్కర్ స్కాం కేసులో కవితిపై ఆరోపణలు వచ్చినా పట్టించుకోకపోవడంతో బీజేపీపై నమ్మకం పోయిందన్నారు కోమటిరెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు విశ్వసిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు మునుగోడు లేదా ఎల్బీనగర్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధపడిందని తెలిపారు.
అయితే, ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మీరు గెలుస్తారని.. ప్రజలు తనతో చెప్పారని రాజగోపాల్ రెడ్డి వివరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరుతున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications