హోం శాఖ అంటే ఇష్టం.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుండగా.. ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆరు మంత్రి పదవులకు అవకాశం ఉండగా.. ఈసారి నలుగురికి ఛాన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి పదవిపై తన మనసులో మాట బయటపెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఈసారి కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు హోంశాఖ అంటే ఇష్టమని మనసులో మాట బయటపెట్టారు. ఈ క్రమంలోనే ప్రజల పక్షాన నిలబడతానని.. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. మంత్రుల ఎంపిక అదిష్టానం నిర్ణయమని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో సీరియస్ గానే చర్చ జరిగినట్లుందని అన్నారు. అయితే తనకు ఇంకా ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని తెలిపారు.

ఇక కేబినెట్ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కనుందని జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మంత్రిగా ఛాన్స్ ఇస్తుందా..? ఇస్తే ఆయనకు ఇష్టమైన హోం శాఖ ఇస్తుందా ? లేక మరేదైనా శాఖను కట్టబెడతారా అని చర్చ నడుస్తోంది.
మరోవైపు నిన్న ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పలు వివిధ సామాజిక వర్గాల నుంచి నలుగురు లేదా ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రెడ్డి సామాజిక వర్గంలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అలానే ఎస్సీ వర్గంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అడ్డంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గంలో ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్‌లకు చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. మరో స్థానం భర్తీ చేయాలనుకుంటే మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక విజయశాంతికి సైతం మంత్రిగా అవకాశం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications