రేవంత్ పక్కలో బల్లెం
Komatireddy Rajgopal Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, అసహనం క్రమంగా తలెత్తుతున్నట్టే కనిపిస్తోంది. నల్లగొండ జిల్లా మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనికి కేంద్ర బిందువు అవుతున్నారు. గతంలో సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు మరోసారి వాటిని పునరావృతం చేశారు. తన ఉద్దేశం ఏమిటో చాటిచెప్పారు.
తాజాగా ఆయన నియోజకవర్గం ప్రజలతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు విమర్శలు సంధించారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికైనా వెనుకాడబోననీ హెచ్చరించారు. అన్యాయం జరిగితే ఎవర్నీ లెక్క చేయబోనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తనకు పదవుల కంటే నియోజకవర్గంలో తనను గెలిపించిన మునుగోడు రైతులు, యువతీ యువకులు, మహిళలు, ఓటర్ల ప్రయోజనాలే ముఖ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా నియోజకవర్గ ప్రజలు కూడా తయారుగా ఉండాలని సూచించారు. అధికారంలో కాంగ్రెస్ ఉందని, ఆ పార్టీ గుర్తు మీదే తాను గెలిచానని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తన నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాటానికైనా సిద్ధమని అన్నారు.
ముఖ్యమంత్రి తనకు ఏదైనా పదవి ఇస్తే చప్పుడు చేయకుండా కూర్చుంటానని అనుకుంటే పొరపాటేనని కోమటిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చే పదవి వద్దు.. పైసలు వద్దు అని కరాఖండీగా తేల్చేశారు. తనకు రైతులు, నియోజకవర్గ ప్రజలు ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అందరూ ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేంత వరకు తాను వెంట ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications