కొండా సురేఖపై రేవంత్ మౌనం.. చర్యల జాప్యం వెనుక బిగ్ రీజన్స్!
తెలంగాణలో మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? ఆమెను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తుందా ? అంటే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. . దీనికి కారణాలు రాజకీయంగా చాలా సున్నితంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కొండా సురేఖపై చర్యల జాప్యం.. ఇదొక కారణం
తెలంగాణా రాష్ట్రంలో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వరంగల్ ప్రాంతంలో కొండా సురేఖకు స్థానికంగా బలమైన పట్టు ఉంది. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తే బీసీ మహిళకు అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్‌కు ఎన్నికల్లో నష్టం కలిగించవచ్చు. కొండా సురేఖపై వేటు వేస్తే ఆమె చేసే ఆరోపణలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారే అవకాశం లేకపోలేదు.

రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం
ఇప్పటికే రేవంత్ రెడ్డిపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి నిదానంగా బయటకు రావడానికి ఇది ఒక అవకాశంగా మారే ప్రమాదం కూడా ఉంది. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని పార్టీలో అంతర్గత విభేదాలను తీవ్రతరం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాలు రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
నామమాత్రంగానే చర్యలు ఉండే ఛాన్స్
అందుకే కొండా సురేఖ వ్యవహారాన్ని తొందరపడి తేల్చకుండా, పార్టీ నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చర్యలు తీసుకోకుంటే కొండా సురేఖపై అసమ్మతి వర్గం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కనుక చర్యలు తీసుకున్నా నామమాత్రంగానే తీసుకుంటారని, తొందరపడి ఇప్పటికిప్పుడు తీసుకునే అవకాశం లేదనే టాక్ వినిపిస్తుంది.
తొందరపాటు నిర్ణయం పార్టీకి ఎదురుదెబ్బ కావచ్చన్న ఆందోళన.. రేవంత్ మౌనం అందుకే
ఎన్నికల సమయంలో ఏదైనా తొందరపాటు నిర్ణయం పార్టీకి ఎదురుదెబ్బ కావచ్చన్న భయంతోనే ప్రస్తుతం వేచి చూసే వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సురేఖ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎంగా ఉన్న తనపై కొండా సురేఖ బిడ్డ చేసిన ఆరోపణలు డైజెస్ట్ కాకున్నా రేవంత్ రెడ్డి కూడా మౌనం వహించటం వెనుక ఇవే ప్రధాన కారణాలు అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications