రేవంత్ హయాంలో అదే తొలి పండగ: వైభవోపేతంగా: నిధుల కోసం సీఎంను కలిసిన కొండా సురేఖ
Sammakka Saralamma Jatara 2024: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క- సారలమ్మ పండగ. రెండు సంవత్సరాలకోసారి జరిగే ఈ పండగను కనివినీ ఎరుగని విధంగా నిర్వహించాలని భావిస్తోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర జరుగనుంది. దీనికోసం ఇదివరకే తేదీలు ఖరారయ్యాయి. జాతర తొలి రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజున పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు, నాగులమ్మను మేడారానికి తీసుకొస్తారు.

22వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని గద్దెపైకి చేర్చుతారు. 23వ తేదీన వనదేవతలు గద్దెలపై కొలువుతీరుతారు. భక్తులకు దర్శనం ఇస్తారు. 24వ తేదీన సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ వనప్రవేశం చేస్తారు. మేడారం జాతరగా ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండగగా గుర్తింపు పొందింది.
వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి ఈ నాలుగు రోజుల్లో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలి వస్తారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగునే ఉన్న ఏపీ, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచీ భక్తులు ప్రత్యేక వాహనాల్లో వనదేవతలను దర్శించుకోవడానికి వస్తుంటారు.
రేవంత్ రెడ్డి హయాంలో జరిగే తొలి పండగ ఇదే కావడంతో దీన్ని వైభవోపేతంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం భారీగా నిధులను కేటాయించే అవకాశం ఉంది. ముందుగానే నిధులను విడుదల చేయాలని, మేడారం జాతర (Medaram Jatara 2024)తో ముడిపడి ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆమె కొద్దిసేపటి కిందటే రేవంత్ రెడ్డిని కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి, యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, మంచినీటి వసతి, మండపం నిర్మాణం వంటి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications