నన్ను తిడుతున్న వ్యక్తుల వెనుక అదృశ్య శక్తి ఉంది: మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ తాజాగా మరో లేఖ రాశారు. తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వారి వెనుక ఉన్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చినా తనపై, తన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
'నన్ను తిడుతున్న వ్యక్తుల వెనుక అదృశ్య శక్తి ఉంది' ఆ అదృశ్య శక్తిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి.. అని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి రాసిన లేఖలో మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనను, తన కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆ నేతల వెనుక ఉండి ఈ వ్యవహారం నడుపుతున్న వ్యక్తులు గుర్తించి, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు. విచారణ జరుగుతున్న సమయంలోనే తనపై ఇలా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పు ఇవ్వడం.. కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నంగా పరిశీలించాలని కోరారు.
మరోవైపు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసిందని అన్నారు. మూడు అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. కొండా సురేఖ నుంచి రిప్లై వచ్చిందని.. కొండా సురేఖ వివరణపై మరోసారి సమావేశం అవుతామని అన్నారు. 'కొండా సుస్మిత మాట్లాడిన వీడియోలను చూశాం.. సీఎంపై కొండా సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారు.. సీఎల్పీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలు చూశాం.. ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తామన్నారు.. అందరి ఫిర్యాదులు తీసుకున్నాక మరోసారి భేటీ అవుతామని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు.

మరోవైపు కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీరియస్ గా తీసుకొన్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణా రాహిత్యంగా భావించి నోటీసులు ఇవ్వడంతో పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications