హుజూరాబాద్ లో గులాబీ వ్యూహం:కారెక్కనున్న బీజేపీ నేత పెద్దిరెడ్డి ..?
హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డి హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్ తనకే ఇస్తున్నారంటూ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కాదా కాంగ్రెస్ పార్టీ చర్యలు దిగిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కౌశిక్ రెడ్డి రాజీనామా, రేవంత్ రెడ్డి పై కౌశిక్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు గా తెలుస్తుంది. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

బీజేపీ నాయకుడు పెద్ది రెడ్డి కెప్టెన్ లక్ష్మీ కాంతా రావుతో భేటీ
పెద్దిరెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందడంతో కెప్టెన్ లక్ష్మీకాంతరావు పరామర్శించడానికి వెళ్లలేక ఫోన్లో పరామర్శించారు. దీంతో పెద్దిరెడ్డి తండ్రి కర్మ ముగిసిన తరువాత తాజాగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు ని కలిసి రెండు గంటల పాటు సమావేశమయ్యారు. గతంలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఇనుగాల పెద్దిరెడ్డి బిజెపి తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. ఇక ఇటీవల ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో పెద్దిరెడ్డి పోటీచేయడానికి బిజెపి నుండి అవకాశం లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనం తో ఉన్న పెద్ద రెడ్డి బాహాటంగానే తన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు.

పెద్దిరెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరే ఛాన్స్
ఈ నేపథ్యంలోనే ఆయన కెప్టెన్ లక్ష్మీకాంతరావు తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కెసిఆర్ తో గతంలో ఉన్న పరిచయం, ఇక తాజాగా తన సహచరుడు అయిన ఎల్.రమణ టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం, హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ బీజేపీ లోకి చేరడం వంటి అనేక కారణాల వల్ల పెద్దిరెడ్డి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి అవకాశమున్నట్టు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా హుజురాబాద్ రాజకీయాలు శర వేగంగా మార్పు చెందుతున్నాయి.
Recommended Video

శరవేగంగా మారుతున్న హుజూరాబాద్ రాజకీయాలు
ఈసారి హుజురాబాద్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎవరికి వారు వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని, తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష కు తెరతీశాయి అని ప్రధానంగా చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications