కృష్ణా నీళ్లు కావాలని లేఖలు: తాగునీటికే.. ఏపీ, తెలంగాణలకు షాక్
హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి సాగుకు నీటిని విడుదల చేయడం వీలుకాదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సోమవారం తేల్చింది. తాగునీటి అవసరాలకు కొంతమేర నీటిని విడుదల చేయడానికి అవకాశముందని, దానిని ఉభయ తెలుగు రాష్ట్రాలు జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది.
త్వరలోనే మళ్లీ సమావేశమై ఈ సీజన్లో నీటి లభ్యత ఎంత ఉండనుందో అంచనా వేసి, ఆ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చిందని తెలుస్తోంది. బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా అధ్యక్షతన ఏపీ, తెలంగాణ అధికారులు, ఇంజినీర్లు భేటీ అయ్యారు.
నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీగా వినియోగం, నీటి విడుదల వివరాలను నమోదు చేయడం, ఈ సమాచారం తెలిపే వెబ్ సైట్‌కు సంబంధించి బోర్డు వివరించింది. అనంతరం నీటి విడుదల పైన చర్చించారు.

కృష్ణా డెల్టాకు పది టిఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ, సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్పీ ఇతర అవసరాలకు నీరు విడుదల చేయాలని తెలంగాణ కోరింది. అయితే, తాగు అవసరాలకు ఎంతెంత కావాలో చెబితే, దాని ఆధారంగా నీటిని విడుదల చేస్తామని, ప్రస్తుతం ఉన్న నీటిని రెండు రాష్ట్రాలు చెరి సగం వినియోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
శ్రీశైలంలో ఉన్న నీటిలో ఏడెనిమిది టిఎంసీల నీటిని వాడుకోవచ్చునని బోర్డు అభిప్రాయపడింది. సాగర్‌లో నీటిమట్టం 510 అడుగులు ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 510 అడుగుల వరకు నీటిమట్టాన్ని కొనసాగించాల్సి ఉంది. అయినప్పటికి సాగర్ నుంచి 1.5 టిఎంసీలు వినియోగించుకోవచ్చునని కానీ, దానిని కేవలం తాగునీటి కోసమే వాడాలని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications