అన్నా క్షమించు.. టిడిపిని వీడుతున్నా: బాబుకు కృష్ణ షాక్, లోకేష్ ర్యాలీ.. టిడిపి నేతపై కేసు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అధికార తెరాసలో చేరుతున్నారు. ఆయన సోమవారం కారు ఎక్కనున్నారు.
కొంతకాలంగా తెలంగాణ టిడిపిలో కొనసాగుతున్న వ్యవహారంతో మనస్తాపానికి గురై ఆ పార్టీని వీడుతున్నట్లు కృష్ణ యాదవ్ ఆదివారం పేర్కొన్నారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు చెప్పారు. ఇద్దరు ముగ్గురు చేతుల్లో పార్టీ నష్టపోతున్న తీరును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
ఆ తర్వాత, తాను పార్టీ పదవికి రాజీనామా చేసినా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేదని ఆయన వాపోయారు. పార్టీలో ఇమడలేని తీరు ఉండటంతో బాధతో పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

ఎందరినో నాయకులుగా తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, పార్టీని వీడుతున్నందుకు అన్నా క్షమించు అంటూ.. స్వర్గీయ నందమూరి తారక రామారావును ఈ సందర్భంగా కృష్ణయాదవ్ గుర్తు చేసుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంతో పనిచేస్తున్న తెరాసలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఏఎస్‌రావునగర్ టిడిపి అభ్యర్థిపై కేసు
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో మొదటి కేసు నమోదైంది. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గంలో నారా లోకేష్ రోడ్ షోలో ఎన్నికల నిబంధన ఉల్లంగించారని ఏఎస్ రావునగర్ టిడిపి అభ్యర్థి తాతినేని సామ్రాజ్యంపై కేసు నమోదు చేశారు.
కాప్రా సర్కిల్ పరిధిలో తెదేపా యువ నేత నారా లోకేష్ ఆదివారం సాయంత్రం కాప్రా, ఈసీఐఎల్, హెచ్‌బీకాలనీ ప్రాంతాల్లో రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పైగా విద్యుత్తు స్తంభాలకు జెండాలను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధలను ఉల్లంగించారు. ఈ నేపథ్యంలో తాతినేని సామ్రాజ్యంపై ఐపీసీ 188 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.












Click it and Unblock the Notifications