ఉప ఎన్నిక వేళ కొత్త భయం, కీలక పరిణామాలు..!!
తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అటు జూబ్లీహిల్స్ బై పోల్ కోసం ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఇటు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అమలు విషయం పైన తుది నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం అవుతోంది. వచ్చే నెల ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరో వైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసారు. ఇలా.. వరుస పరిణామాలతో పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. పార్టీ నాయకత్వంలో కొత్త టెన్షన్ కనిపిస్తోంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసారు. ఇదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఉప ఎన్నిక వస్తుందని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే.. ఉప ఎన్నికలు అంటే భయం ఎందుకని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేయాలని.. ఎవరు గెలుస్తారో చూసుకుందమంటూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ 20 నెలల లనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్‌లపై కేసులు నమోదు చేయడం తప్పా అంతకు మించి చేసిందేమి లేదన్నారు.

సొంత ఆస్తులు, భూములు పెంచుకోవటానికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని వ్యాఖ్యానించారు. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీని వీడినా.. శేరిలింగంపల్లిలోని కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలబడ్డారని చెప్పారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో అరాచకం చేస్తుందని మండిపడ్డారు. దుర్గం చెరువులోని సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము ఉందా? అంటూ హైడ్రాకు కేటీఆర్ సవాల్ విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు గుండెకాయగా కేసీఆర్ చేశారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సన్నాసి పనుల వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications