రేవంత్ రెడ్డి పక్కనే మానవ బాంబులు!: నీళ్లివ్వడం చేతకాదంటూ కేటీఆర్ విమర్శలు
కరీంనగర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటి సమస్యలను తీర్చే చావ లేక, చేతకాక లోటు వర్షపాతమనడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రాష్ట్రంలో ఐఎండీ లెక్కల ప్రకారంగా 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14శాతం ఎక్కువ వర్షపాతం నమోదయిందని ట్విట్టర్ (ఎక్)స్ వేదికగా పేర్కొన్నారు.
అబద్దాలు అలవికానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు సత్యదూరం మాటలతో ప్రవర్తించడాన్ని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతు సమస్యలు తీరుస్తామనడం అటుంచి, తెలంగాణ రైతాంగానికి మూడు నెలల్లోనే స్కాంగ్రెస్ చేతగానితనం పూర్తిగా అర్థమయ్యిందంటూ కేటీఆర్ విమర్శించారు.

మరోవైపు, కరీంనగర్ కదనబేరి సన్నాహక సమావేశంలోనూ కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సెంటిమెంటని.. ఇక్కడ్నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆనాడు ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడ్నుంచే జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
పాలమూరు సభలో సీఎం రేవంత్ భాష తనకైతే అర్థం కాలేదన్నారు కేటీఆర్. గొంతు కోస్తా.. మానవ బాంబై పేలుతా అంటున్నారని మండిపడ్డారు. రేవంత్ పక్కనే మానవ బాంబులు ఉన్నాయన్న కేటీఆర్.. అవే ఆయనను కూల్చుతాయన్నారు. రేవంత్ ను ఖమ్మం, నల్గొండ బాంబులే ఏదైనా చేయొచ్చని అన్నారు. బీఆర్ఎస్ నుంచి రేవంత్ కు ఎలాంటి ప్రమాదం ఉండదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
సీఎంగా రేవంత్ ఐదేళ్లు నిక్షేపంగా ఉండాలన్నారు కేటీఆర్. ఐదేళ్ల పాలన చూశాకే ఎవరు గొప్పవాళ్లో ప్రజలకు తెలుస్తుందన్నారు. ఇది కాలం తెచ్చిన కరవు అని సీఎం అంటున్నారని.. కానీ, ఇది కాలం తెచ్చినది కాదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ తెచ్చిన కరవేనని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వొచ్చు కానీ.. కేసీఆర్‌ని బద్నాం చేయాలని రిపేర్ చేయడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్లు మోడీ ప్రధానిగా.. ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉండి కరీంనగర్‌కు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications