విధ్వంసమే కాదు, 10 వేల కోట్ల స్కాం! హెచ్‌సీయూ భూములపై కేటీఆర్ సంచలనం
హెచ్‌సీయూ భూముల్లో పర్యావరణ విధ్వంసమే కాదు.. రూ. 10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ భూ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డినే అని అన్నారు. భూ యాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే పది వేల కోట్ల లోన్ ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంకు తన క్రెడిబిలిటీని కోల్పోయిందన్నారు.
త్వరలోనే ఆ బ్యాంక్ కుప్పకూలడం ఖాయం. ఈ స్కాంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ప్రధాని మోడీ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15- 16 నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3d మంత్రతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని విమర్శించారు.

దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న తెలంగాణ రైతన్న కడుపు మీద కొట్టారు. ప్రజల దృష్టి మరల్చి, భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ ప్రభుత్వం పాల్పడింది. హెచ్‌సీయూలో జరిగిన పర్యావరణ విధ్వంసంపై దేశం మొత్తం నివ్వెర పోయి చూసింది. అక్కడ పర్యావరణ విధ్వంసం, మూగజీవుల ప్రాణాలు మాత్రమే తీయలేదు. హెచ్‌సీయూ పక్కన ఉన్న అటవీ భూములను అడ్డం పెట్టుకుని ఒక అతిపెద్ద ఆర్థిక మోసానికి రేవంత్ ప్రభుత్వం పాల్పడిందని కేటీఆర్ ఆరోపించార.
ఇదొక నేరపూరిత కుట్ర. తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతుకం. రాత్రికి రాత్రి బుల్డోజర్లను పెట్టి వందల ఎకరాల్లో చెట్లను కూల్చివేసి మూగ జీవాలకు నిలువ నీడ లేకుండా చేసిన రేవంత్ ప్రభుత్వ ఆరాటం వెనుక పదివేల కోట్ల రూపాయల స్కాం ఉంది. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం ఆ 400 ఎకరాలు ముమ్మాటికి అటవీ భూమే అని కేటీఆర్ అన్నారు.
అది అటవీ భూమే..
రిజర్వ్ ఫారెస్ట్ అని ప్రత్యేకంగా డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నా దాన్ని అటవీ భూమి గానే గుర్తించాలని 1996లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అలాంటి భూముల లెక్కలు తీయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చింది. పాయింట్ ఫోర్ కానోపి ఉన్న భూమి కచ్చితంగా అటవీ భూమినే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎంపీ సహకారం
1980 ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ ప్రకారం అటవీ భూములను తాకట్టుపెట్టే లేదా అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అటవీశాఖ అనుమతి లేదు ఎన్విరాన్మంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ కూడా చేయలేదు. అయినా కూడా రేవంత్ ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి పాల్పడింది. ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ ను చెప్పారని అన్నారు కేటీఆర్.
169 కోట్ల లంచం ఇచ్చిన సర్కారు!
ఎఫ్ఆర్బీఎంను బైపాస్ చేసి డబ్బులు తీసుకొస్తామని చెప్పి అందుకు కమిషన్ ఇవ్వాలని ఆ కంపెనీ కోరింది. ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అనే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 169 కోట్లు లంచం చెల్లించింది.
ఆ తరువాత బీకన్ ట్రస్టీ షిప్ అనే కంపెనీని ముందుకు పెట్టి మోసానికి పాల్పడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు రాగానే రూ. 75 కోట్లకు ఒక ఎకరం చొప్పున ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదలాయిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది కేటీఆర్ తెలిపారు.
జీవో మాత్రమే ఇచ్చారు కానీ ఆ భూమిని ఎలియనైజేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా చేయలేదు. అంటే ప్రభుత్వానికి ఆ భూమిపై ఓనర్ షిప్ రాలేదన్నట్టే. టీజీఐఐసీకి ఆ భూములపై ఓనర్‌షిప్ లేదు. తనది కాని భూమిని బ్రోకర్ కంపెనీ మాట విని టీజీఐఐసి తాకట్టు పెట్టింది. ఈ మోసానికి టీజీఐఐసీతో పాటు పరిశ్రమల శాఖ సెక్రెటరీని జైల్లో వేయొచ్చు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా, భూ యాజమాన్య హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకోకుండానే ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్ల డబ్బులు చెల్లించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకారం కంచె గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900 రూపాయలు. కానీ రెవిన్యూ శాఖ మాత్రం ఆ భూమి విలువ 30 వేల కోట్లు అని చెప్పుకుందని కేటీఆర్ అన్నారు.
రేవంత్ సర్కారు మోసం చేసింది
ప్రభుత్వం, బ్రోకర్ సంస్థ, ఐసిఐసిఐ బ్యాంకు కుమ్మక్కై ఆ భూమికి లేని విలువను ఉన్నట్లుగా చూపించి పదివేల కోట్ల లోన్ తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంకును, బ్యాంకులను, దేశాన్ని రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది.
ఎకరానికి రూ. 75 కోట్లు అని జూన్ లో జీవో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల తర్వాత మళ్లీ ఇంకో సంస్థతో నవంబర్ 23న కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చిందని కేటీఆర్ చెప్పారు.
ఎకరం రూ. 75 కోట్లు కాదు కేవలం రూ. 52 కోట్లు మాత్రమే అని రిపోర్ట్ తయారు చేశారు. ఈ ఐదు నెలల కాలంలో ఏం మారింది? రూ. 25 కోట్ల విలువ ఎందుకు తగ్గింది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ తర్వాత బహిరంగ మార్కెట్లో రిలయబుల్ వ్యాల్యూ అసెస్‌మెంట్ అని ఎకరాకు రూ. 41.6 కోట్లు మాత్రమే అని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇలా ఆ 400 ఎకరాల భూమి విలువను రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 16,640 కోట్లకు ప్రభుత్వం కుదించిందని కేటీఆర్ ఆరోపించారు.
అదే బ్యాంకరు, అదే బ్రోకర్ ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఆ భూములను తమ మనుషులకు అడ్డికి పావు సేరు అమ్మడానికి రేవంత్ కుట్ర చేస్తున్నాడు. భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండానే టీజీఐఐసీ ఆ భూమిని ఐసిఐసిఐ బ్యాంకుకు ఎలా తనఖా పెట్టింది? సేల్ డీడ్ కూడా లేని భూమికి ఐసిఐసిఐ బ్యాంకు ఎలా రుణం ఇచ్చింది? ఇది ఫ్రాడ్ కాదా? బీకన్ ట్రస్టీ షిప్ అనే కంపెనీ, ట్రస్ట్ అడ్వైజర్స్ అనే బ్రోకర్ ని ప్రభుత్వం ఎలా ఎంపిక చేసింది? ఏ రూల్స్ ని ఫాలో అయ్యారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీ చెప్పాడని వాళ్లకు ఇచ్చారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అటవీ భూమిని అమ్మడమే తప్పు.. నీది కాని భూమిని అమ్మడం ఇంకా పెద్ద తప్పు.. పారదర్శకత లేకుండా మొదట రూ. 30 వేల కోట్లని ఆ తర్వాత రూ. 20 వేల కోట్లని చివరికి రూ. 16 వేల కోట్లకు ఆ భూమి విలువను కుదించి తన వాళ్లకు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ఆర్థిక మోసానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. ఆర్‌బీఐ గవర్నర్ కు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సెబి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలకు మా పార్టీ తరపున ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నాం. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నామని కేటీఆర్ తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డ బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఆయాచిత లబ్ధి జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో ఐసిఐసిఐ బ్యాంకు లోన్ మంజూరు చేసింది. ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలిసి కూడా.. ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇచ్చింది. కనీసం ఆ భూమిని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధులు ఎవరు ఇన్స్పెక్ట్ కూడా చేయలేదన్నారు కేటీఆర్.
కేవలం బ్రోకర్ చెప్పాడని పదివేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి ఐసిఐసిఐ బ్యాంకు చెల్లించింది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని విచారిస్తాం. ఈ డబ్బులతో రైతు బంధు వేస్తామని తమ అనుకూల మీడియాలో ప్రచారం చేశారు కానీ రూ. 5000 కోట్లు కూడా అన్నదాతల ఖాతాలో వేయలేదు మిగతా రూ. 5000 కోట్లు ఏమయ్యాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఐసీఐసీఐ బ్యాంక్ కుప్పకూలుతుంది!
మంత్రివర్గంలో ఉన్న కాంట్రాక్టర్లు, వాళ్ల మనుషులకు కమిషన్లు, బిల్లులు చెల్లించడానికి ఉపయోగించారు. ఈ ఆర్థిక మోసంతో ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఆ బ్యాంకు కుప్పకూలే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండానే జరిగిందని భావిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ది నిరూపించుకోవాలి. రేవంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంకు, బ్రోకర్ సంస్థ పాత్రపై విచారణ జరగాల్సిందే. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు అడ్డుకోకపోతే మరో అరవై వేల కోట్ల రూపాయల భూ దోపిడీకి రేవంత్ ప్రభుత్వం స్కెచ్ చేసింది. బీకన్ ట్రస్టీ షిప్ అనే కంపెనీ, ట్రస్ట్ అడ్వైజర్స్ సంస్థలకు హెచ్ఎండిఏ భూములను ప్రభుత్వం అప్పజెప్పింది. ఈ రెండు సంస్థలపై వెంటనే నిషేధం విధించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆ ఎంపీ పేరు బయటపెడతా
అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం తీసుకున్న పదివేల కోట్ల రూపాయల బాండ్లను ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ కుమ్మక్కయ్యిందని భావించాల్సి వస్తుంది. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ పేరును బయట పెడతాను. కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోతే కోర్టుకు పోతాం.
మా పార్టీ తరఫున ప్రధానమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెప్పారు.
కేంద్రం చర్యలేవీ?
మిత్రపక్షాల ద్వారా లోక్ సభ, రాజ్యసభల్లోను ఈ అంశాన్ని లేవనెత్తుతాం. నిన్న వచ్చిన అపెక్స్ కమిటీ పర్యావరణ విధ్వంసంపై విచారణ జరిపింది. అందుకే ఈ ఆర్థిక మోసంపై ఫిర్యాదు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు కానీ, ఇప్పటిదాకా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ అన్నారు.
అమృత్ స్కాంలో రేవంత్ రెడ్డి బావమరిదికి రూ. 1137 కోట్ల రూపాయలు దారి మళ్లించాడని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకోలేదు. రెవిన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే ఇప్పటిదాకా అధికార ప్రకటన రాలేదు. ఈ వ్యవహారాన్ని ఈ ఆర్థిక మోసాన్ని కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటారో.. లేదంటే నిజంగానే సమగ్ర విచారణకు ఆదేశించి మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ దోపిడీని ఉపేక్షించమని చెప్పి కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కేటీఆర్ అన్నారు.
దొంగ చేతికి నేను ఇప్పుడే తాళాలు ఎందుకని ఆ బీజేపీ ఎంపీ పేరు చెప్పడం లేదు. ఈ దేశంలో సామాన్యుడు బ్యాంకు లోన్ తీసుకోవాలంటే 100 డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి 100 కొర్రీలు పెట్టి లోన్ ఇస్తారు. అదే ఒక సంపన్నుడు అధికారపక్షంతో అనుబంధం ఉన్నవాడు లోన్ అడిగితే నిమిషాల్లోనే మంజూరు చేస్తారు. కనీసం భూమి ఉందో లేదో కూడా చెక్ చేయరు ఇక్కడ అదే జరిగింది కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఐసిఐసిఐ లాంటి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు, భూ యాజమాన్య హక్కును పరిశీలించకుండానే ఆ భూమి ఎవరిదో తెలుసుకోకుండానే పదివేల కోట్లు లోన్ ఇవ్వడం ఆశ్చర్యం. ఈ భూ కుంభకోణం కర్త కర్మ క్రియ సూత్రధారి పాత్రధారి అంతా రేవంత్ రెడ్డినే. ఇన్ని క్లూస్ ఇచ్చాక జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కేటీఆర్ కోరారు.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications