Telangana Balagam: కేటీఆర్ కొత్త కాన్సెప్ట్: ట్వీట్..డిలిట్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది.

ఎన్నికల ప్రచారంలో తీరిక లేెకుండా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలందరూ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీ కిషన్ రెడ్డి, డాక్టర్ కెే లక్ష్మణ్.. ఇలా సీనియర్లందరూ జిల్లాస్థాయిలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగారు.
ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ బలగం (Telangana Balagam) పేరుతో ప్రత్యేకంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో చేరాలంటూ బీఆర్ఎస్, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ బలగంలో చేరడానికి అవసరమైన గూగుల్ ఫామ్ లింక్‌ను కేటీఆర్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనికి భారీగా స్పందన లభిస్తోంంది. పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్- కేటీఆర్ అభిమానులు ఇందులో జాయిన్ అవుతున్నారు. కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామంటూ ప్రతిజ్ఞ చేస్తోన్నారు.
ఈ ట్వీట్‌ను కొద్దిసేపటి తరువాత ఆయన డిలిట్ చేశారు. కారణాలేంటో తెలియట్లేదు గానీ గూగుల్ ఫామ్ లింక్‌ను కూడా ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి తొలగించారు. విమర్శలకు దారి తీయొచ్చనే కారణంతోనే ఆయన దీన్ని తొలగించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications