మోడీజీ! మీరు మారరా? అంటూ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు మరోసారి దిగ్భ్రాంతికి గురిచేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ అవమానించడం ఇదేం తొలిసారి కాదన్నారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభ ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ విభజన సరైన రీతిలో జరగలేదని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

'మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని..? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం ..? తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు
మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..? తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు..?' అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

KTR hits out at PM Modis

అంతేగాక, 'పద్నాలుగేండ్లు పోరాడి..దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకు..? ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు మీరు..? వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని మా రైతుల్ని కించపర్చిండు..మీ కేంద్రమంత్రి.. ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా..మీలాగే మీ మంత్రులు..!' అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

'మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు, కనీసం..మాటల్లోనైనా మర్యాద చూపించండి ..! కోటి ఆశలు..ఆకాంక్షలతో పురుడుపోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా..ఆదినుంచి కక్షను పెంచుకొని..వివక్షనే చూపిస్తున్నారు మీరు..! ఏడు మండలాలు గుంజుకొని ..లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం..!' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'నీతి ఆయోగ్‌ చెప్పినా నీతిలేకుండా మిషన్ కాకతీయ..భగీరథలకు నిధులను నిరాకరించిన మీ నిర్వాకాన్ని ఏమనాలి..? కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థంచేసుకోవాలి..? కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి
దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా..?' అని ఘాటుగా వ్యాఖ్యానించారు కేటీఆర్.

'157 మెడికల్ కాలేజీల్లో ..ఒక్కటి ఇవ్వకుండా గుండుసున్నా చేసారంటే ..మీకు తెలంగాణపై ఎంత కోపమో కదా..! పైన అప్పర్ భద్ర..కింద పోలవరం..ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదా ఇచ్చి..మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు.. మేం చేసిన పాపమేంది..?' అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

'బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి..గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి..ఆదివాసులపై కక్షసాధిస్తున్నారు ఎందుకు..? సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేస్తరు.. ఐటీఐఆర్‌ను రద్దు చేస్తరు.. హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు.. మీరు నిధులివ్వరు...సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తరు..! అడుగడుగునా దగా..ప్రశ్నిస్తే పగ
జుమ్లా..హమ్లా డబుల్ ఇంజన్‌ సర్కారు మీది..!' అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేవారు.

'ఈడీ..ఐటీ..సీబీఐలను మీ ఎన్డీయే కూటమిలో చేర్చుకొని ..ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్నమీకు..పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం ..విచిత్రం..! డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే మీకు తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు.. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా..!' అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

'తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు.. మీ పాలనలో ఒక్క విషయం లేదు కాబట్టే.. ప్రతిసారీ తెలంగాణ పై విషం చిమ్ముతున్నారా..?? రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా... తెలంగాణపై ఎందుకింత కక్ష ?? తెలంగాణతో ఏమిటీ వివక్ష ??? అడ్డగోలుగా విభజన చేశారని ఒకసారి.. తల్లిని చంపి బిడ్డను బతికించారని మరోసారి.. తెలంగాణలో సంబరాలు జరగనే లేదని ఇంకోసారి..
ఇలా ఎన్నిసార్లు పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారు..!!' అంటూ మండిపడ్డారు కేటీఆర్.

'మా దశాబ్దాల కల నెరవేరిన నాడు... అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు
అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా.. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ? నాటి ఉత్సవం నుంచి.. నేటి దశాబ్ది ఉత్సవం వరకూప్రతి తెలంగాణ పుట్టిన రోజు... మా అందరికీ పండుగరోజు గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే..' అని కేటీఆర్ అన్నారు.

'తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా నిలిచి.. సమున్నత శిఖరాలను అధిరోహించింది తెలంగాణ.. ఈ ప్రగతి ప్రస్థానాన్ని చూసి ఎందుకు ఓర్వలేకపోతున్నారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్ ను మించిపోయిందనేనా.. మీకు తెలంగాణపై గుండెలనిండా ఇంతటి ద్వేషం? ప్రధానమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరే రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియపై ఎలా నిందలు వేస్తారు?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

'ఇది... ప్రాణత్యాగం చేసిన అమరులను... కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని... కోట్లాది మంది ప్రజల మనసులను గాయపరచడమే...పార్లమెంట్ లో ఇచ్చిన విభజన హామీలకు పాతరేసి అబద్ధాల జాతర చేస్తామంటే సహించం... భరించం... ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని దగా చేశారు. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మోసం చేశారు' అని కేటీఆర్ మండిపడ్డారు.'తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోండి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపండి అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పండి. ద్వేషం కాదు.. దేశం ముఖ్యం.. దేశం అంటే రాష్ట్రాల సమాహారం.. జై తెలంగాణ.. జై భారత్. ' అంటూ కేటీఆర్ సుదీర్ఘ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+