రేవంత్ రెడ్డే అధికారంలో ఉండాలి - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. హెచ్‌సీయూ భూముల వివాదం చుట్టూ రాష్ట్ర రాజకీయం సాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని చెప్పారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు.
కేటీఆర్ వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యగా కేటీఆర్ ఆసక్తికర విశ్లేషణ చేసారు. ఈ వ్యవహారంలో ఈ రూ.10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఉన్నాయన్నారు. అధికార మదంతో విర్రవీగుతూ.. మేమే నియంతలం, రారాజులం అని అనుకుంటున్న వారికి నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు ఒక గుణ పాఠమని పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూముల కోసం పోరాడి న విద్యార్థులు, సామాజికవేత్తలకు అభినందనలు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. కంచగచ్చిబౌలి భూమి వర్సిటీ ఆధీనంలో ఉన్నదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చెప్పిందన్నారు. ఆ భూములపై సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సూచించిందని కేటీఆర్ వివరించారు.

కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం
10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే పూర్తిస్థాయి విచారణ జరగాలని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని అన్నారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. సెంట్రల్ వర్సిటీ భూముల్లోకి ప్రభుత్వం బుల్డోజర్లను పంపి విధ్వంసం సృష్టిస్తున్నదని మోదీ చెప్పారన్నారు. హెచ్‌సీయూ భూములపై రేవంత్ రెడ్డి చేసిన కుంభకోణంపై మోడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు, పోలీసుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వెల్లడించారు.
రేవంత్ కొనసాగాలి
కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆర్థిక దోపిడీ, పర్యావరణపై దాడి విషయంలో ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేసారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి ఐదేండ్లు అధికారంలో ఉండాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ తమకు లేదని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం అని చెప్పుకొచ్చారు. తమ దగ్గర కూడా ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ, ఈ ఐదేండ్లు రేవంత్ రెడ్డే అధికారంలో ఉండా లని.. అప్పుడే ఇంకో 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలంటే భయపడతారన్నారు. ఫార్ములా-ఈ కేసులో మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తాను ఎప్పుడూ అధికారులను బలిపశువులను చేయలేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications