కేటీఆర్ ఇంటికి హుటాహుటిన లీగల్ టీమ్
KTR: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫార్ములా ఇ-కార్ రేస్ అవినీతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్‌ను ఎదుర్కొంటోన్నారు మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సారథ్యంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను ఇచ్చింది. దీన్ని కొట్టివేస్తోన్నట్లు తెలిపింది. ఈ క్వాష్ పిటీషన్‌పై ఇదివరకే హైకోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఇరు పక్షాల నుంచి వాదోపవాదాలను ఆలకించింది ఉన్నత న్యాయస్థానం. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ ఉదయం తుది ఉత్తర్వులు ఇచ్చింది.

ఫార్ములా ఈ- రేస్ నిర్వాహకులకు ఎవరి అనుమతులు లేకుండా 46 కోట్ల రూపాయలను పౌండ్ల రూపంలో హెచ్ఎండీఏ చెల్లించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ వివరించారు. నిబంధనల మేరకు 10 కోట్ల రూపాయలకు మించి జరిగే లావాదేవీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
హెచ్ఎండీఏ మున్సిపల్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిగా ఈ చెల్లింపులకు కేటీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే- అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్ కుమార్‌పైనా కేసు నమోదైందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై సిద్ధార్థ్ దవే తన వాదనలను వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని అన్నారు. అవినీతి జరిగినట్లు ఏసీబీ ఎక్కడే గానీ ఆధారాలను చూపించలేకపోయిందని చెప్పారు. కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని న్యాయస్థానానికి అభ్యర్థించారు. వాదోపవాదాలను విన్న అనంతరం హైకోర్టు తీర్పు ఈ క్వాష్ పిటీషన్‌ను కొట్టివేసింది.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నందినగర్‌లో ఉన్న తన నివాసంలో కేటీఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు. సిద్ధార్థ్ దవే సహా కొందరు న్యాయ నిపుణుల సలహాలను స్వీకరిస్తోన్నట్లు సమాచారం.
అందుబాటులో ఉన్న కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. లీగల్ టీమ్‌తో పూర్తిస్థాయిలో సంప్రదింపులు నిర్వహించారు. క్వాష్ పిటీషన్‌పై సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై చర్చించారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలా? వద్దా? స్టే లభించే అవకాశం ఎంతవరకు ఉంది? అనే అంశంపై సమాలోచనలు జరిపారు.
సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వాదనలు ఎలా ఉండాలనే విషయంపై చర్చించారు. ఏసీబీ దాఖలు చేసిన కేసులు తనకు వర్తిస్తాయా? లేదా? ఈ- ఫార్ములా కారు రేసుల చెల్లింపుల్లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా తన ప్రమేయం ఎంతవరకు ఉంది?.. అనే అంశాలపై కేటీఆర్ తన లీగల్ టీమ్‌తో చర్చించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications