మోదీ నిజామాబాద్ పర్యటన వేళ- తెరపై 3 హామీలు: నెరవేర్చడంపై అనుమానాలు?
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణకు రాబోతోండటం ఇది రెండోసారి. మహబూబ్ నగర్‌లో పర్యటించిన ఆయన ఇప్పుడు తాజాగా నిజామాబాద్‌కు రానున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.మోదీ నిజామాబాద్ పర్యటన వేళ.. మంత్రి, అధికార భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్- మూడు కీలక హామీలను తెరమీదికి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలవి. ఇప్పటివరకూ అవి అమలుకు నోచుకోలేదు.
వాటి గురించి కేటీఆర్ మోదీని ప్రశ్నించారు. ఆ మూడు హామీల సంగతేమిటంటూ నిలదీశారు. వాటి అమలుపై విస్పష్టమైన ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణను మోసగించారంటూ మండిపడ్డారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణకు వస్తోన్నప్పటికీ.. ఈ మూడు విభజన హామీలకు దిక్కేది? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు కేటీఆర్.

1. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఎప్పుడు ప్రాణం పోస్తారని ప్రశ్నించారు కేటీఆర్. 2. బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడంటూ నిలదీశారు. 3. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ఏమైందంటూ గుర్తు చేశారు. ఈ మూడు విభజన హక్కులను పదేళ్ల నుంచి పాతరేశారని, ఇంకా ఎంతకాలం ఈ అబద్ధాల జాతర చేస్తారని విమర్శించారు.
గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలు దించుతున్నారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారంటూ నిప్పులు చెరిగారు. లక్షల ఉద్యోగాలను కల్పించే ఐటీఐఆర్‌ను ఆగం చేశారని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారని, దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారంటూ మండిపడ్డారు.
మోదీ పదేళ్ల పాలనలో.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మాత్రమే కాదు..140 కోట్ల భారతీయులను సైతం మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు, దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు, పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు.. వాటిల్లో ఏ ఒక్కటైనా అమలైందా? అని ప్రశ్నించారు.
కార్పొరేట్ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చారా అంటూ మోదీ నిలదీశారాయన. పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ వంటిదేనని చురకలు అంటించారు. ఎన్నికల వేళ హంగామా మాదిరేనని, ఇప్పుడు చేసిన ప్రకటన అమలు అయ్యేది ఎప్పుడోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ప్రధానిగా మోదీ పదేళ్ల పాలనలో అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి? మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని స్పష్టం చేశారు కేటీఆర్. మళ్లీ వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీనని, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications