మా నాన్నే గ్రేట్! యుగానికి ఒక్కరే పుడతారు: లోకేష్ వర్సెస్ కెటిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అందులో భాగంగా టిడిపి యువనేత నారా లోకేష్, తెరాస నేత, మంత్రి కెటి రామారావుల మధ్య కూడా పరోక్షంగా మాటల యుద్ధం సాగుతోంది. వారసుల మధ్య మాటల ఫైట్ ఆసక్తికరంగా కనిపిస్తోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు లోకేశ్ మాట్లాడుతూ... హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చలువే అన్నారు. హైదరాబాద్ పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే, మూడు ఫొటోలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఆ మూడు ఫొటోల్లో ఒకటి చార్మినార్, రెండోది బుద్ధుడి విగ్రహం, మూడోది హైటెక్ సిటీ అన్నారు. వీటిలో చార్మినార్‌ను మినహాయిస్తే బుధ్దుడి విగ్రహాన్ని టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేస్తే, చంద్రబాబు హైటెక్ సిటీని నిర్మించారన్నారు.

ఈ వ్యాఖ్యల పైన మంత్రి కెటిఆర్ సోమవారం పరోక్షంగా స్పందించారు. హైదరాబాదు అభివృద్ధి తమ వల్లే సాధ్యమైందని జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ, చివరకు చార్మినార్‌ను కూడా తామే నిర్మించామని చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
తమ పార్టీ బాధ్యత గలదని, అందర్నీ సమానంగా చూస్తుందని చెప్పారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ఇదివరకు అవకాశమిచ్చారని, కానీ వారు చేసిందేమీ లేదన్నారు. తమకు సీమాంధ్రులు, తెలంగాణ వారు రెండూ సమానమేనని చెప్పారు.
మంత్రి కెటిఆర్ సోమవారం నాడు తన తండ్రి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆకాశానికెత్తారు. కేసీఆర్‌లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరు మాత్రమే పుడతారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరాన్ని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు నాశనం చేశాయన్నారు.












Click it and Unblock the Notifications