రేవంత్ రెడ్డి వైఖరి ఎలాంటిదో తేల్చి చెప్పిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. వరుసగా బహిరంగ సభలను నిర్వహిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజున వెలువడుతుంది. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులనూ ఒడ్డుతోంది. బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. బుధవారం బస్సు యాత్రను ప్రారంభించారు. రెండో రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా కొనసాగనుంది.
ఈ బస్సు యాత్రపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సెటైర్లు సంధించారు. కాంగ్రెస్ బస్సుయాత్ర..తుస్సుమంటుందని వ్యాఖ్యానించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ కాగా, చీకటి పాలనకు చిరునామా కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న కర్ణాటక.. అంటూ ఆరోపించారు.
గత పదేళ్ల కాలంలో- గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపలేదని కేటీఆర్ నిలదీశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా బీజేపీని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని తేల్చి చెప్పారు.
కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొంద పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని, దీనికి భిన్నంగా మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం తమదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కర్ణాటకలో రైతులకు అయిదు గంటల కరెంట్ కూడా ఇవ్వలేమంటూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ- సాగును సంబురంగా మార్చిన పాలన తమదని అన్నారు.
నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎవ్వరూ విశ్వసించబోరని, ఆ పార్టీ కొత్త నాటకాలకు తెరతీస్తే ఎవరు నమ్ముతారని కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కాంగ్రెస్ పార్టీ- కోల్డ్ స్టోరేజీలో పెట్టగా, ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి, అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు.
శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్‌కు ఆ పేరు ఎత్తే హక్కు లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చేసిన 10 సంవత్సరాల జాప్యం వల్లే వందల మంది బలిదానాలకు కారణమైందని, తెలంగాణకు నంబర్ వన్ విలన్.. కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ ఆరోపించారు.
గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందంటూ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు కేటీఆర్. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ తెలంగాణ పీసీసీ చీప్.. అంటూ మండిపడ్డారు. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు... రేవంత్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు.
తమ ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ- రిమోట్ మాత్రం గాడ్సే చేతిలో మాడి మసైపోతోందంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. మూడు రోజుల పర్యటన చేసినా..మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని, అన్ని రంగాల్లోనూ వైఫలమైన కాంగ్రెస్‌ను ఎప్పటికీ విశ్వసించరని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications