జూబ్లీహిల్స్ షాక్: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
KTR: జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఓటమిని కేటీఆర్ చిన్న సెట్ బ్యాక్‌గా అభివర్ణించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఆయన ఈ విధంగా అన్నారు. "రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ముందుకు పోదాం, కార్యకర్తలు సన్నద్ధం కావాలి. మరింత బలంగా పనిచేద్దాం. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ శ్రమిద్దాం." అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయం అని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అద్భుతంగా పనిచేశాయని కేటీఆర్ అభినందించారు. వ్యక్తిగతం సమస్యలు ఉన్నా బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం కోసం నిర్వరామంగా పనిచేశారని.. వారికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రతి బూత్‌లో స్థానిక నాయకత్వం బాగా పనిచేసిందని.. మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా ఆమె ఎంతో కష్టపడ్డారన్నారు. ఓ రకంగా పోరాటమే చేశారన్నారు.

"గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ అద్భుతమైన పాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలు కేంద్రంగా కొట్లాడుతున్నాం. ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు ధన్యవాదాలు." అంటూ కేటీఆర్ అన్నారు. ఎన్నికల తీరుపై కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికలో నిజాయతీగా కొట్లాడామని.. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసన్నారు. వాటి గురించి తాను మాట్లాడనని.. ప్రచారం ముగిసే వరకూ ఒకరకంగా.. ముగిశాక మరో రకంగా జరిగాయంటూ అధికార పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ చరిత్రను గుర్తు చేస్తూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. "2014-23 మధ్య ఏడు ఉప ఎన్నికలు జరిగాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికలోనూ గెలవలేదు. మేము ఐదు గెలిచాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తే కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒకట్రెండు కార్పొరేట్ సీట్లు మాత్రమే వచ్చాయి. పదేళ్లు ప్రభుత్వం నడిపిన ఓ జవాబుదారీ పార్టీగా జూబ్లీహిల్స్‌కు ఏం చేశారంటే.. మేము రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం." అని కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ కుల, మత రాజకీయాలు, అసభ్య పదజాలం ఉపయోగించకుండా చాలా హుందాగా పోరాటం చేసిందని, ప్రజా సమస్యలు, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాలు.
— KTR News (@KTR_News) November 14, 2025
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/NjfBailh6F
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు అంశం
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో రాబోయే ఉప ఎన్నికలపై కేటీఆర్ హెచ్చరించారు. "దొంగ ఓట్ల గురించి స్పష్టమైన ఆధారాలు ఇచ్చాం. పోలింగ్ రోజు మా అభ్యర్థి పట్టుకున్నారు. ఎన్నికల కమిషన్, పోలీసులు సమాధానం చెప్పాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై బెంగాల్‌లో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో కూడా పది చోట్ల ఉప ఎన్నికలు రావాల్సిందే. ఒక్క ఉప ఎన్నికకే కాంగ్రెస్ ఇన్ని ఆపసోపాలు పడింది. పది చోట్ల ఉప ఎన్నికలు జరిగితే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను తీసుకొస్తారేమో" అంటూ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.












Click it and Unblock the Notifications