మీ బావమరిది లీగల్ నోటీసులకు భయపడతానా?: రేవంత్ రాజీనామా ఖాయమన్న కేటీఆర్
అమృత్ పథకం టెండర్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిన ఢిల్లీలో ఉన్న బీజేపీ కూడా కాపాడటం కష్టమేనని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమృత్ పథకం విషయంతో తాను చేసిన వ్యాఖ్యలకు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
'బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోము. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్‌లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజం. శోద అనే కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే. ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నది. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా, నువ్వు దొరికావు. రాజీనామా తప్పదు' అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా, అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సృజన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు మూడు రోజుల క్రితం లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిది సృజన్ రెడ్డికి పనులు అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పగించారన్నారు. రూ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి రూ. 1000 కోట్ల విలువైన పనులు చేస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications