ఎక్కడి నుంచైనా గంటలో హైదరాబాద్ కు - ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ, గేమ్ ఛేంజర్...!!
తెలంగాణలో ఎన్నికల యుద్దం పతాక స్థాయికి చేరింది. రేపు (మంగళవారం) ప్రచారం ముగియనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమం - అభివృద్ధి తమను గెలిపిస్తాయని నమ్ముతున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో భారీ రవాణా వ్యవస్థను అందుబాటులో తెచ్చేందుకు బిఆర్ఎస్ ప్రణాళికలు సిద్దం చేసారు. ఇది గేమ్ ఛేంజర్ కానుంది.
టీఆర్‌టీ ప్రతిపాదనలు
మంత్రి కేటీఆర్ తెలంగాణ ర్యాపిడ్ ట్రాన్సిట్ (టీఆర్‌టీ) వ్యవస్థ ప్రతిపాదనలను ఆవిష్కరించారు. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రతిపాదనలు ఆచరణ దిశగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసారు. పట్టణీకరణ నేపథ్యంలో ఢిల్లీ పరిధిలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్‌ఆర్‌టీఎస్)ను చేపట్టింది.

రూ.1,66,000 కోట్లతో ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ర్టాల్లోని పట్టణ ప్రాంతాలను కలుపుతూ అత్యంత వేగవంతమైన రైల్వే వ్యవస్థను తలపెట్టింది. ఇదే తరహాలో తెలంగాణలోని దాదాపు ఏ ప్రాంతం నుంచి అయినా హైదరాబాద్‌కు ప్రజలు గంటలో చేరుకొనేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
గంటలో హైదరాబాద్ కు
కొత్తగా తొమ్మిది మార్గాల్లో తెలంగాణ ర్యాపిడ్ ట్రాన్సిట్ (టీఆర్‌టీ) వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు వెల్లడించారు. 792 కిలోమీటర్ల టీఆర్‌టీ మార్గం నిర్మించేందుకు రూ.55,440 కోట్ల వ్యయం అవుతుందని అంచనాగా పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న రైలు, బస్సులు, మెట్రో, కార్లు వంటివే కాకుండా పర్యావరణహితమైన, అత్యంత వేగవంతమైన టీఆర్‌టీ వ్యవస్థను తెలంగాణలో నిర్మించేందుకు తొమ్మిది మార్గాలను ఎంపిక చేశారు.
హైదరాబాద్ నగరంపై భారం పడకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా గంట వ్యవధిలో హైదరాబాద్‌కు చేరుకొనే అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా టీఆర్‌టీని సిద్ధం చేశారు. ఇది కార్యరూపం దాల్చితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాల నుంచి గంటలోనే ప్రజలు హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
గేమ్ ఛేంజర్ గా మారేనా
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కి.మీ పొడవున ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి భూ ఉపరితలంపైనే టీఆర్‌టీ రైల్వే మార్గాన్ని నిర్మించనున్నారు. దీనిపై రైళ్లు గంటకు అత్యధికంగా 180 కి.మీ వేగంతో, సరాసరిన 100 కి.మీ వేగంతో రాకపోకలు సాగిస్తాయి. ఇందుకోసం కిలోమీటర్‌కు రూ.70 కోట్ల చొప్పున 9 మార్గాల్లో 792 కి.మీ మేర టీఆర్‌టీ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసారు.
ఓఆర్‌ఆర్ చుట్టూ కొత్తగా మెట్రో నోడల్ పాయింట్లను గుర్తించి అక్కడి నుంచి 9 మార్గాల్లో టీఆర్‌టీ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రాథమిక నివేదికను ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రాజెక్టును ప్రజా రవాణా వ్యవస్థలోనే విప్లవాత్మక చర్య సర్కారు భావిస్తున్నది. హైదరాబాద్ నుంచి తొమ్మిది మార్గాల్లో ప్రతిపాదించిన టీఆర్‌టీ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్దం చేసారు. దీంతో, ఇలాంటి అభివృద్ధి తమతోనే సాధ్యమని చెబుతున్న బీఆర్ఎస్..ఇది మొత్తంగా గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు. ఇక..ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ ప్రాజెక్టు భవిష్యత్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications