లాస్య నందితను వెంటాడిన మృత్యువు .. మృతికి కారణాలివే; సాయన్న కుటుంబానికి ఫిబ్రవరి గండం!!
తెలంగాణ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గత 60 రోజులుగా ఆమె వరుస ప్రమాదాలకు గురికావడం, ఇక ఈరోజు తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ప్రమాదంలో మరణించడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల లోనే కాక ప్రజలను కూడా చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా లాస్య నందితను మృత్యువు వెంటాడుతోందని, చివరకు నేడు మృత్యువు ఆమెను కబళించింది అని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండు నెలలలోనే ఆమె మృత్యు ఒడికి చేరుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాలలో విషాదాన్ని మిగిల్చింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లాస్య నందిత గత నెలలో బోయిన్పల్లి లోని ఒక ఆసుపత్రిలో లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఆ తర్వాత నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఆమె కారు నార్కెట్పల్లి వద్ద ప్రమాదానికి గురికాగా ఆ ప్రమాదంలోనూ స్వల్ప గాయాలతో లాస్య నందిత బయటపడ్డారు. అప్పుడు లాస్య నందిత కారు ప్రమాదంలో ఒక హోంగార్డు మృతి చెందారు.
ఇక నేడు లాస్య నందిత ఓఆర్ఆర్ పై ప్రయాణం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను గత రెండు నెలల కాలంగా మృత్యువు వెంటాడుతోందని, ఈ ఘటనలతో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ రోజు లాస్య నందిత కారు ప్రమాద ఘటన ఏ విధంగా జరిగింది? ఆమె మృతికి గల కారణాలు ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవర్ విపరీతమైన వేగంతో కారు నడపడం, మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ సేఫ్టీ తక్కువగా ఉండడం ప్రమాదానికి, ఆమె మృతికి ప్రధాన కారణాలని చెబుతున్నారు. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడం వలన జరిగిన ప్రమాదంలో లాస్య నందితకు బలమైన గాయం కావడం వల్ల ఆమె ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఫలితంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారని చెబుతున్నారు.
గతంలో రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్, ప్రస్తుత ప్రమాదానికి కూడా కారణమని, ఆ డ్రైవర్ ను మార్చి ఉంటే, లేదా లాస్య నందిత స్కార్పియో వాహనాన్ని ఉపయోగించి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదని కూడా భావిస్తున్నారు. సాయన్న కుటుంబానికి ఫిబ్రవరి గండం ఉందని, అందుకే లాస్య నందిత చిన్న వయసులోనే కన్నుమూసిందని సాయన్న కుటుంబ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications