తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజులు పొడిగింపు: పగటిపూట మరింత సడలింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, పగటిపూట సడలింపును మరింత పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు ఉండగా, ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. దీంతో ప్రజలకు కొంత వెసులుబాటు కలిగినట్లయింది.
Recommended Video
రాష్ట్రంలో మరో పది రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది. అయితే, మరో గంటపాటు ప్రజలు, ప్రయాణికులు తమ ఇళ్లకు చేరేందుకు వెసులుబాటు కల్పించింది.

ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో కఠిన లాక్‌డౌన్ అమలు కానుంది. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తే మళ్లీ కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నదని భావించిన సర్కారు.. పగటిపూట వెసులుబాటుకు మాత్రమే అనుమతిచ్చింది. రేపటితో గతంలో విధించిన లాక్‌డౌన్ గడువు ముగుస్తుండటంతో ప్రభుత్వం తాజాగా మరో పది రోజులపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా, గత 24గంటల్లో 1,33,134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1897 మంది మహమ్మారి బారినపడినట్లు తేలింది. మరో 15 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 3409కి చేరింది. తాజాగా, 2982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,306 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 182 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో రికవరీ రేటు 95.34 శాతం ఉండగా, మరణాలు రేటు 0.57 శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications