తెలంగాణలో ప్రజావాణికి బ్రేక్..!!
Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమం.. ప్రజావాణి. ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో పాలనను వారి వద్దకే తీసుకెళ్లడంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్ బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజా భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కో రోజు ఒక్కో శాఖకు చెందిన మంత్రులు ప్రజావాణిలో పాల్గొంటారు. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కొనసాగుతుంది. ఒక్కో ప్రజావాణిలో వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతుంటాయి. ధరణి పోర్టల్, పింఛన్లు, డబుల్ బెడ్ రూం.. వంటి అంశాలు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటారు సామాన్య ప్రజలు. వాటన్నింటినీ శాఖలవారీగా విభజించి, ఏ శాఖకు చెందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఆ శాఖకు పంపుతారు. వాటిని పరిష్కరించడానికి ఆయా మంత్రులు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ కార్యక్రమానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనికి తాత్కాలింగా పుల్ స్టాప్ పెట్టినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసేంత వరకు అంటే జూన్ 7వ తేదీ వరకు ప్రజావాణి కార్యక్రమం అందుబాటులో ఉండదని అంటున్నారు. జూన్ 7వ తేదీన పునఃప్రారంభమౌతుందని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర కమిషన్ ఇదివరకే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నాలుగో విడతలో అంటే మే 13వ తేదీన తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ షెడ్యూల్ అయింది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.












Click it and Unblock the Notifications