వరల్డ్ రికార్డ్, బ్రిటన్ ఎన్నికలను మించి: ‘హుజూరాబాద్’ ఖర్చుపై జేపీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ బ్రిటన్ ఎన్నికల వ్యవస్థను పట్టుకునే వేలాడుతున్నామన్నారు.
ప్రజలు కోరుకునేది దీర్ఘకాలిక సంపదనే అని జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఏ రూపంలో ఖర్చు పెడితే సంక్షేమం అనేది ఆలోచించి చేయాలన్నారు. శాశ్వతంగా పేదరికాన్ని పోగేట్టేందుకు ఆ డబ్బులను ఖర్చు పెట్టాలని సూచించారు. రాజకీయాల్లో డబ్బు అనే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తాయిలాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయని జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిక ఏదైనా ఓట్ల కోసం పార్టీలు ఇచ్చే తాయిలాలు పెరిగిపోతున్నాయన్నారు. తెలంగాణలో అక్టోబర్ నెల30న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై కూడా స్పందించారు.

ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని ప్రకటించినా ప్రజలు పట్టించుకోలేదని.. వారెంత దూరదృష్టితో ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలని జయప్రకాశ్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఖర్చు వరల్డ్ రికార్డ్ అని జేపీ చెప్పారు. బ్రిటన్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఒక్క నియోజకవర్గ ఎన్నికకు పెట్టిన ఖర్చు ఎక్కువ అని చెప్పారు. ఎన్నికల సంఘం పాత్ర పోలింగ్ బూత్‌లో జరిగే పని వరకే అని జయప్రకాశ్ నారాయణ తెలిపారు.
Recommended Video
కాగా, ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, ఈ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 500 కోట్లకుపైగా ఖర్చు చేసిందని ఈటల సహా బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేగాక, దళితబంధు పథకం కూడా ఇక్కడ్నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సుమారు 2వేల కోట్ల రూపాయలను కూడా ఇందుకోసం విడుదల చేసింది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications