బంగాళాఖాతం నుంచి ఏమని హెచ్చరిక అందింది?
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఆరు జిల్లాల్లో శనివారం, శుక్రవారం నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురియనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురియనున్నాయి. శనివారం రోజు మాత్రం పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, కుమరంభీమ్-ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, ములుగు, జయశంకర్-భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
20 నుంచి 22 సెంటీమీటర్లకు పైగా
పైన పేర్కొన్న ప్రాంతాల్లో 20 నుంచి 22 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రోడ్లు, చిన్న చిన్న ఎత్తు ఉన్న వంతెనలు మునిగిపోవడంతోపాటు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, అలాగే ఒకేసారి వరద ముంచుకువచ్చే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వీటి ధాటికి విద్యుత్తు స్తంభాలతోపాటు చెట్లు విరిగిపోతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఏర్పాట్లు
ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర విపత్తుల, నిర్వహణ సంస్థ అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారు. గురువారం రోజు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు వానలు కురిశాయి.












Click it and Unblock the Notifications