చంద్రబాబును చూసి నేర్చుకో రేవంత్: మహేశ్వర్ రెడ్డి హితబోధ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు తెలంగాణ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని సూచించారు. హామీల అమలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి మూడు రోజుల క్రితం లేఖ రాశానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే వృద్ధాప్య పింఛన్లను 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతూ సంతకం చేశారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు తెలంగాణలో వృద్ధాప్య పింఛన్లను రూ. 4 వేలు చేస్తానని రేవంత్ అన్నారని.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయినా అమలు కావడం లేదని మండిపడ్డారు.

సర్కారు బడుల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు పంపిణీ చేసే పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చి మళ్లీ తీసుకున్నారని.. దీంతో రాష్ట్ర ఖజానాపై మరో భారం పడుతుందన్నారు. వ్యక్తిగత కారణాలతో ప్రజా ధనాన్ని వృథా చేస్తే ఊరుకోబోమని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ బొమ్మ పుస్తకాలపై వచ్చి ఉండొచ్చని.. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కానీ, ఇచ్చిన పుస్తకాలు తీసుకోవద్దని సూచించారు.
పుస్తకాలపై జాతీయ గీతం ఉందని తెలిసింది.. దాన్ని తీసేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉన్న పుస్తకాలు పిల్లలకు ఇచ్చారని గుర్తు చేశారు మహేశ్వర్ రెడ్డి. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిని చూశారన్నారు. ఇప్పుడు ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారన్నారు. ఏం స్కాం జరిగినా దానిపై విచారణ ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక, రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications