వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు పునర్నిర్మాణంపై లేటెస్ట్ అప్‌డేట్!
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్న విషయంతెలిసిందే. తాజాగా పునర్నిర్మాణ పనుల్లో మరో కీలక అభివృద్ధి నమోదైంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ డాక్యుమెంట్ల దాఖలు గడువును ఈ నెల 24న సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. ష్యూరిటీ బాండ్ల సమర్పణ గడువును 28వ తేదీ వరకు పెంచింది.
టెండర్ ల దాఖలు గడువు పెంచిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
మొదటి కవర్ టెక్నికల్ బిడ్ ను ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకు తెరవనున్నారు. రెండో కవర్ ఫైనాన్షియల్ బిడ్ తెరిచే తేదీని తర్వాత ప్రకటిస్తారు. బిడ్ మేనేజర్ తెలిపిన ప్రకారం, నిర్ణీత బిడ్ ధర కంటే 30 శాతం వరకు తక్కువగా టెండర్లు వేసే అవకాశం కల్పిస్తూ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించేలా నిబంధనలు సవరించారు. ఇది మరిన్ని కంపెనీలు పాల్గొనేందుకు అనుకూలం.

కేంద్ర సహకారంతో మామునూర్ ఎయిర్ పోర్ట్ పనులు వేగం
మామునూరు ఎయిర్‌పోర్టు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలస్యమైన ఈ పనులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నాయి. కేంద్ర సహకారంతో మామునూర్ ఎయిర్ పోర్ట్ పనులు వేగం పుంజుకున్నాయి. సుమారు 950 ఎకరాల్లో ఈ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 696 ఎకరాలతో పాటు అదనంగా 253 ఎకరాలు సేకరించి ఏఏఐకి అప్పగించింది.
కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు ఎయిర్పోర్ట్
ప్రాజెక్టు వ్యయం రూ.850 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 2,500 మీటర్ల రన్‌వే, 820 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఆధునిక టెర్మినల్, ఆప్రాన్, టాక్సీవేలు, పెరీమీటర్ రోడ్డు, ఎమర్జెన్సీ సదుపాయాలు ఉంటాయి. కాకతీయ సంస్కృతి ప్రతిబింబించేలా టెర్మినల్ డిజైన్ రూపొందిస్తున్నారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో ఈ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చెయ్యాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేమ్ ఛేంజర్
జూన్ 2, 2028 నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.పెరీమీటర్ వాల్ టెండర్ ఇప్పటికే ఖరారైంది. ప్రీ-బిడ్ సమావేశాలు జరిగాయి. రన్‌వే, ఎయిర్‌సైడ్ పనులకు టెండర్లు కొనసాగుతున్నాయి. ఈ విమానాశ్రయం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications