సినీ ఫక్కీలో దోపిడీ: 2లక్షలు, ఫోన్‌తో ఉడాయింపు
హైదరాబాద్: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిపై ఇద్దరు దుండగులు దాడి చేసి దోపిడీకి పాల్పడి రూ. 2 లక్షలతో ఉడాయించిన సంఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గోషామహల్‌కు చెందిన రాజేందర్ ఓ వ్యాపారి. బేగంబజార్‌లో ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. రాజేందర్ కుమారుడు చేతన్ (20) కాచిగూడలోని ఓ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. చేతన్ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తన తల్లి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి సిద్ధంబజార్‌లోని ఏటీఎం నుంచి రూ.2 లక్షలు డ్రా చేశాడు.

తన కైనటిక్ హోండా డిక్కీలో డబ్బులు పెట్టుకొని బొగ్గులకుంట చౌరస్తాలోని అణ్మ వారి ఆలయం వీధి నుంచి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అతనిపై దాడి చేసి డిక్కీలోని నగదుతో పాటు సెల్‌ఫోన్ లాక్కుని ఉడాయించారని చేతన్ సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదుతో డీఐజీ కిశోర్‌బాబు తన సిబ్బందితో సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఆరా తీశారు. బాధిత యువకుడు చెబుతున్న వివరాలు, దోపిడీపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు యువకుడు ఏటీఏం నుంచి అంత డబ్బు డ్రా చేశాడా లేదా అన్న విషయాన్ని బ్యాంకులో విచారించి దోపిడీ నిజయా లేదా కట్టుకథా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications